డీడీఎస్ భూమేత!
మూతబడ్డ బాల్వాడీ పాఠశాలలు!
74 ఎకరాలను అమ్మేసిన సొసైటీ
మిగతా 41 ఎకరాల్లో కొనసాగని బాల్వాడీ
మహిళా సంఘాల నోట్లో మట్టికొట్టి..
పేదపిల్లల నోటికాడి ముద్దనూ బొక్కిన సంస్థ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో బీద బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి పరిచేందుకు ఏర్పడిన డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) భారీ ఎత్తున భూమేతకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సంస్థ పెద్దలు ఇప్పటికే 74 ఎకరాలను అమ్మేసి సొమ్ముచేసుకు న్నట్లు సమాచారం. బాల్వాడీ పాఠశాలూ మూతపడ్డాయి. హిళా సంఘాల నోట్లో మట్టికొట్టి.. పేదపిల్లల నోటికాడి ముద్దనూ మెక్కారు. అంతేకాదు అనేక సంస్థల ఇచ్చిన కోట్ల నిధులూ గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తుంది.
43 ఏళ్లుగా ప్రతి ఏటా ఈజెడ్‌ఈ ఇస్తున్న రూ.3కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు అందజేస్తున్న నిధులు, మానవ అభివృద్ధి సంస్థ నుంచి కూడా పెద్ద మొత్తం తీసుకుంటున్న నిధుల్లో కూడా అవకతవకలకు పాల్పడినట్లు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డీడీఎస్‌లో రాజ్యమేలుతున్న అవినీతి, అక్రమాల బాగోతం పై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం..
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో బీద బడుగు బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి పరిచేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ వెలువడింది. ఆ సంస్థ పేరు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్). ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను సంఘాలుగా ఏర్పాటు చేసి వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచేందుకు కృషి చేసింది. ఈ సంస్థ ప్రతి గ్రామంలో పనులకు వెళ్లిన మహిళలు, చిన్న పిల్లలను తీసుకొని అడవి ప్రాంతాలకు మహిళలు వెళ్లడం వల్ల అక్కడ పిల్లలకు అపాయం జరగవచ్చనే ఉద్దేశంతో ఈ సంస్థ గ్రామాల్లో బాల్వాడీలను ఏర్పాటు చేసింది.
ఈ బాల్వాడీల మనుగడకు భూములను స్వదేశీ, విదేశీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొనేసింది. ఈ బాల్వాడీల్లో పనికి వెళ్లే వారి పిల్లలకు ఆహారం కోసం ప్రతి ఇంటిలో రోజూ చేసుకునే ఆహార పదార్థాల్లో పిడికెడు ధాన్యాన్ని ఒక కుండలో వేస్తారు. వారం రోజుల తర్వాత ఆ ధాన్యాన్ని మహిళలందరూ తీసుకొచ్చి పోగేస్తారు. అందులో నుంచి రోజూ కొద్దిగా తీసి, బాల్వాడీలో ఉండే పిల్లలకు ఆహారంగా ఇస్తారు. ఇలా డీడీఎస్ గ్రామీణ ప్రాంతాల్లో తమ సంఘాలు ఏర్పాటు చేసి, వారందరికీ బాల్వాడీల నిర్వహణను అప్పగించింది. ఈ సంఘాలు నడుపుతున్న బాల్వాడీల నిర్వహణ చూసి విదేశీసంస్థలు ఆర్థిక సహాయాన్ని అందించాయి.
74 ఎకరాల భూమిని అమ్ముకున్న పెద్దలు?
భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో బీద పిల్లల కోసం డీడీఎస్ సంస్థ కొనుగోలు చేసిన 115 ఎకరాల నుంచి 74 ఎకరాల భూమిని సొసైటీ పెద్దలు అమ్మి సొమ్ము చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆ భూమి కొనుగోలు కోసం సంఘం ద్వారా 20 శాతం నిధులిచ్చినప్పటికీ ఆ సంఘానికి ఈ భూమికి సంబంధం లేకుండా పోయింది. మిగతా 41 ఎకరాల భూమి ఉన్నప్పటికీ ఆ భూమిలో ఆయా గ్రామాలకు సంబంధించిన బాల్వాడీలు కొనసాగడం లేదు.
అయితే ఇప్పటికీ బాల్వాడీల నిర్వాహణ కోసం బ్రిటన్‌కు చెందిన ఈజెడ్‌ఈ అనే సంస్థ ప్రతి సంవత్సరం రూ.3కోట్లను ఇస్తుంది. ఈ సంస్థ 1983 నుంచి ఇప్పటివరకు ప్రతేటా రూ.3కోట్లు ఇస్తోంది. విదేశాల సంస్థల నుంచి డీడీఎస్ సంస్థకు పెద్ద మొత్తంలో దాతలు ఉన్నట్లు సంస్థలో పనిచేసిన కొందరు తెలియజేస్తున్నారు. ఇటీవల జరిగిన డీడీఎస్ పాత పంటల జాతరను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సందర్శించారు. ఈ సమయంలో కొందరు డీడీఎస్ సంఘ మహిళలు ఆయనను కలిసి తమ బాల్వాడీ భూములను తమ పిల్లలకు చెందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సంగారెడ్డి/జహీరాబాద్, (విజయక్రాంతి)
115 ఎకరాలు కొనుగోలు
విదేశీ సంస్థల ఆర్థిక సహాయంతో డీడీఎస్ సంస్థ జహీరాబాద్ నియోజకవర్గంలోని 22 గ్రామాలలో 115 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అంతేగాకుండా ఈ భూముల కొనుగోలు కోసం గ్రామాల్లో ఉన్న సంఘాలు 20 శాతం నిధులు వెచ్చించారు. ఈ భూమిలో పండించిన పంటల ద్వారా గ్రామాలలోని సంఘాల్లో పనిచేసే పిల్లలే కాకుండా గ్రామీణంలోని బీద పిల్లల అందరికీ బాల్వాడీలలో తగిన పౌష్టికాహారాన్ని అందించేందుకు కృషి చేసింది.
డీడీఎస్ సంస్థ బాల్వాడీల కోసం కొనుగోలు చేసిన భూమిలో దున్నుటకు, పంట పండించుటకు, కలుపుతీయటకు ఎటువం టి నిధులు ఖర్చు చేయలేదు. అయితే సంఘంలో పనిచేస్తున్న మహిళలు ఉచితంగానే పంటను పండించి, నూర్పిడి చేసి బాల్వాడీలకు అందించేవారు. డీడీఎస్ సంస్థ రోజురోజుకూ అభివృద్ధి జరుగుతూ ప్రతి పల్లెలో తన సత్తాను చాటింది.




