1 March, 2026 | 6:20 AM

ట్రయల్ రన్ సక్సెస్!

01-03-2026 12:12 AM

కార్యరూపం దాల్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ

ఏప్రిల్ లేదా మే నెలలో 

ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం

వందల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి

పదిహేనేళ్ల్ల నిరీక్షణ అనంతరం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. కాజీపేటలో 2010  సంవత్సరంలో కేంద్రంలో అధికారంలో ఉన్న అప్పటి యూపీఏ ప్రభుత్వం రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంజూరు చేసింది. అయితే, కాజీపేటలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాకుండా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ పార్టీలకతీతంగా ఉద్యమాలు చేపట్టారు.

భారత ప్రధానిగా ఈ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావు హయాంలోనే ఉత్తరాది దక్షిణాదికి మధ్య ఉన్న కాజీపేట జంక్షన్ రైల్వే పరంగా అభివృద్ధి చేయడంతో పాటు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ దశాబ్దాల కిందట ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షగా ఉండేది. అప్పట్లో ప్రజల ఆకాంక్ష నెరవేరకపోవడంతో చాలా కాలం పాటు ప్రధాని పీవీ పట్ల ఈ ప్రాంతంలో వ్యతిరేక భావం కూడా నెలకొంది. అయితే యూపీఏ ప్రభుత్వం కాజీపేటలో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంతో కొంత సానుకూలత ఏర్పడింది.

రూ.560 కోట్ల వ్యయంతో..

2023లో 560 కోట్ల రూపాయల వ్యయంతో 160 ఎకరాల్లో రైల్వే వేగం మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ మంజూరు చేశారు. అయితే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాకుండా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ మళ్లీ తెరపైకి రావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023లో వరంగల్ రైల్వే మల్టిపుల్ యూనిట్‌గా అప్ గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. ప్రధాని హామీ మేరకు 2025లో కాజీపేట మ్యానుఫ్యాక్చరింగ్ షెడ్ పరిశీలనకు వచ్చిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ యూనిట్‌గా అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. రైల్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు ప్రారంభించారు.

ప్రధాన వర్క్‌షాప్, పెయింట్ షాప్, టెస్ట్ షాప్ పనులు పూర్తి చేశారు. అత్యాధునిక యంత్రాలు, స్టోరేజ్ ఫెసిలిటీ ఏర్పాటైంది. 2మెగావాట్ల రోప్ టాప్ సోలార్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేశారు. రైన్ వాటర్ హార్వెస్టింగ్, ఎన ర్జీ ఎఫిషియంట్ లైటిం గ్, ఆధునిక సీవేజ్ ట్రీ ట్మెంట్, గ్రీన్ ఇండస్ట్రియల్ పద్ధతులు ప్రవేశ పెట్టారు. 2023లో శం కుస్థాపన జరిగిన రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పనులు 95శాతానికి పైగా పూర్తిచేశారు. ఇందులో ప్రధా నంగా ట్రాక్ కనెక్టివిటీ ట్రయల్ రన్ ఈనెల 21న విజయవంతంగా నిర్వహించారు. మల్టిపుల్ యూనిట్ నుంచి మెయిన్ ట్రాక్ వరకు 12.5 కిలోమీటర్ల మేర నిర్మించిన రైల్వేట్రాక్‌పై ఒక కోచ్‌తో డీజిల్ ఇంజన్ జత చేసి ఇటువంటి ఆటంకం లేకుండా నడిపారు. నూతనంగా నిర్మించిన ట్రాక్ ఫిట్నెస్, స్పీడ్ తనిఖీ కార్యక్రమం విజయవంతం అయ్యింది.

మిగిలిన చిన్న చిన్న పనులను రెండు మాసాల్లో పూర్తిచేసి ఏప్రిల్ లేదా మే నెలలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేసేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత 15ఏళ్ల క్రితం మంజూరైన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్ గ్రేడ్ అయి అందుబాటులోకి రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఒక గుర్తింపు దక్కడంతోపాటు ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరడం, ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో  వందల మందికి జీవనోపాధి లభించే విధంగా దోహద పడనుంది. 

 బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి