పిల్లలేం పాపం చేశారు?!
సమిధలుగా మారుతున్న చిన్నారులు
మహబూబాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): క్షణికావేశం.. మానసిక వేదన.. ఎలాంటి సంఘటనలైనా తమతోపాటు కన్న పిల్లలను సమిధలుగా చేస్తున్న ఘటనలు ఇటీవల తరచుగా చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ జిల్లాలో వరసగా జరుగుతున్న తల్లుల ఆత్మహత్యల ఘటనలో అభం శుభం ఎరుగని ఆ పిల్లల ప్రాణాలను కూడా తీయడం తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. వరంగల్ జిల్లా ఇల్లంద సమీపంలో కట్రియాలకు చెందిన వివాహిత కళ్యాణి భర్తతో ఏర్పడ్డ కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు ఒడిగట్టింది.
ఎస్సారెస్పీ కాలువలో తన మూడేళ్ల వయసు గల కుమారుడు శ్రేహాన్స్ తో దూకింది. తాను చనిపోవాలని గట్టి నిర్ణయం తీసుకున్నప్పటికీ, తనతో పాటు అభం శుభం ఎరుగని మూడేళ్ల పసి బాలుడి మరణానికి కారకురాల అయింది. ఆ పిల్లాడు తనతో పాటు ప్రాణాలు వదిలే విధంగా చున్నీతో బాలుడిని నడుముకు కట్టేసుకోవడం ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఈ సంఘటన మరువకముందే హైదరాబాదులో మూసాపేటలో జరిగిన ఘటనలో వరంగల్ జిల్లా చందరావుపేట మండలం బోరమాణిక్యం తండాకు చెందిన తల్లి స్రవంతి, తన ఇద్దరు పిల్లలు కార్తీక్, కౌశిక్ లతో ఆత్మహత్యకు పాల్పడింది.
తన ఇద్దరు పిల్లలను చంపి తాను తను చాలించింది. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకొని తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, కుటుంబ సభ్యులు, బంధువులకు, గ్రామ పెద్దలకు చెప్పినా పట్టించుకోవడంలేదని, మళ్లీ తనను అతని వెంటే కలిసి జీవించాలని నచ్చజెప్పడం తట్టుకోలేక ఆ తల్లి తనతో పాటు ఇద్దరు పిల్లల ప్రాణాలను బలి తీసుకుంది. తల్లి ప్రేమకు మించింది మరోటి లేదని.. అయితే అందుకు భిన్నంగా ఆ కన్న తల్లులే తమ పిల్లల ప్రాణాలను చిటిమేసిన ఘటనలు వరంగల్ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.




