14 May, 2026 | 4:20 AM

జోగిపేటలో చెడ్డీ గ్యాంగ్ కలకలం

14-05-2026 12:50 AM
  1. ప్రైవేట్ స్కూల్ బస్సులు, లారీ నుంచి డీజిల్ చోరీ
  2. సుమారు 150 లీటర్ల డీజిల్ మాయం 

జోగిపేట(సంగారెడ్డి), మే 13 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో సోమవారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాల బస్సులతో పాటు ఒక లారీ నుంచి ఈ ముఠా డీజిల్‌ను చోరీ చేసింది. సోమవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

జోగిపేటలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాల ఆవరణలోకి ప్రహరీ దూకి ప్రవేశించిన ముగ్గురు దుండగులు.. అక్కడ నిలిపి ఉన్న పాఠశాల బస్సుల నుంచి సుమారు 50 లీటర్ల డీజిల్‌ను దొంగిలించారు. అదే రాత్రి మరో ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక లారీ నుంచి 100 లీటర్ల డీజిల్‌ను చోరీ చేశారు.

దొంగలు చెడ్డీలు ధరించి కారులో రావడం, డీజిల్ దొంగిలించడం వంటి దృశ్యాలన్నీ పాఠశాల ఆవరణలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. నిందితులు వాడిన కారు నంబర్ ప్లేట్‌ను పోలీసులు పరిశీలించగా, అది ఆటో నంబర్‌గా తేలింది. వారు ప్రయాణించిన కారు కూడా దొంగిలింనదే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగిపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.