పశువుల అక్రమ రవాణా నివారణకు చెక్ పోస్టులు
మంచిర్యాల డీసీపీ భాస్కర్
మంచిర్యాల, మే 12 (విజయక్రాంతి) : పశువుల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ పేర్కొన్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు తాండూరు మండలం రేపల్లెవాడ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్టును సోమ వారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేసి చెక్పోస్ట్ వద్ద అమలులో ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న అధికారులు,
సిబ్బందికి పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీ చేసిన ప్రతి వాహనానికి సంబంధించిన వివరాలను రిజిస్టర్లో తప్పకుండా నమోదు చేయాలని, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ అక్రమ పశువుల రవాణాపై పటిష్ట నిఘా కొనసాగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా జరిగే రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, అనుమానాస్పద రవాణా గమనించినట్లయితే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు. డీసీపీ వెంట తాండూర్ సీఐ దేవయ్య, బెల్లంపల్లి వన్టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు, తాండూర్ ఎస్‌ఐ ప్రసాద్ తదితరులున్నారు.






