రహదారుల నిర్మాణానికి రేవంత్‌రెడ్డి సర్కార్ పెద్దపీట
గ్రామీణ ప్రాంతాలకు ఆధునాతన రోడ్డు సౌకర్యాలు
రాష్ట్ర అభివృద్ధికి రహదారులే కీలకం
రూ.150 కోట్లతో పెద్దపల్లి బైపాస్ నిర్మాణం
పెద్దపల్లి,సుల్తానాబాద్,ఆగస్టు 19(విజయక్రాంతి) రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గ్రామీణ ప్రాంతాలకు ఆధునాతన రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అన్నారు. బుధవారం సుల్తానాబాద్ పట్టణంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా రూ.47 కోట్లతో సుల్తానాబాద్ నుంచి పెద్దాపూర్ వరకు రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ.... గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రహదారులు ఎంతో కీలకమని, రాష్ట్రవ్యాప్తంగా రూ.36 వేల కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే రెండున్నరేళ్లలో రాష్ట్రంలోని రహదారులను మెరుగుపరుస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మరో రెండుసార్లు అవకాశం కల్పిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలను కోరారు. పెద్దపల్లి పట్టణానికి రూ.150 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.

తెలంగాణను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
రాష్ట్రంలో మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తూ తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లికి బైపాస్ రోడ్డు నిర్మించలేదని విమర్శించారు. సుల్తానాబాద్‌కు కూడా అతి త్వరలో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తెలంగాణలోని రహదారులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, వచ్చే రెండున్నరేళ్లలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఏడాదిలోగా పెద్దపల్లి బైపాస్ పూర్తి చేస్తాం
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు(Peddapalli MLA Chintakunta Vijaya Ramana Rao) మాట్లాడుతూ మంత్రుల సహకారంతో పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేయించేందుకు కృషి చేస్తానన్నారు. రానున్న రెండేళ్లలో 60 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్లు బిరుదు రాధాకృష్ణ, నూగిళ్ల మల్లయ్య, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, సింగిల్‌విండో చైర్మన్లు, మహిళా సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






