23-02-2026 04:32:33 PM
వచ్చే నెల నుండి గ్రామంలోనే పంపిణీ
కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): హిరపూర్ గ్రామ ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుంది. రేషన్ సరుకుల కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సిన అవసరం లేకుండా, వచ్చే మార్చి నెల నుండి గ్రామంలోనే రేషన్ పంపిణీ చేసేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
హిరపూర్ గ్రామస్థులు రేషన్ తీసుకోవడానికి ప్రస్తుతం 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసిఫాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సుదీర్ఘ ప్రయాణం ప్రజలకు, వృద్ధులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు సోమవారం 9వ వార్డు కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ రియాజ్ కి వినతిపత్రం సమర్పించారు.
ప్రజల విజ్ఞప్తిపై ఎంఆర్ఓ రియాజ్ తక్షణమే స్పందించారు. సంబంధిత రేషన్ డీలర్ రావుల పాండురంగను పిలిపించి మాట్లాడారు. మార్చి నెల నుండి హిరపూర్ ప్రజలకు వారి గ్రామంలోనే రేషన్ సరుకులు అందేలా చర్యలు చేపట్టాలని డీలర్‌ను ఆదేశిస్తూ హామీ ఇచ్చారు. తమ సమస్యను పరిష్కరించిన ఎంఆర్ఓ కి ఇందుకు కృషి చేసిన కౌన్సిలర్ సాలం బిన్ అహ్మద్‌కు హిరపూర్ గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.