18 August, 2026 | 3:55 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్సులకు చెక్

18-08-2026 02:09 AM

ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు

బాన్సువాడ, ఆగస్టు 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోకి ప్రైవేట్ అంబులెన్సు మాఫియా ఇష్టారీతిన పేద రోగుల నుండి వసూలు చేస్తున్నారని అనుమతులు లేనిది ప్రభుత్వ ఆసుపత్రిలో వాహనాలు నిలుపుతున్నారని విజయ క్రాంతి ఎడిషన్ లో గత కొన్ని రోజులుగా ప్రచురితమైన కథనాలకు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ స్పందించారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి అనుమతి లేకుండా ప్రైవేట్ అంబులెన్సులు ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ అనుమతి లేనిదే ప్రైవేట్ అంబులెన్సులకు లోనికి అనుమతి లేదు అని బోర్డులో స్పష్టం చేశారు.

ఆసుపత్రి నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ప్రాంగణంలోకి ప్రవేశించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రి ప్రాంగణంలో క్రమశిక్షణను పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. విజయ క్రాంతిలో వచ్చిన కథనాలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించి వెంటనే చర్యలు చేపట్టడంపై స్థానికులు పేద రోగులు హర్షం వ్యక్తం చేస్తూ విజయ క్రాంతి పత్రికను అభినందించారు.