ఉపాధిలో అక్రమాలకు చెక్!
ఐరిష్‌తో హాజరు విధానం
బోగస్ మస్టర్‌కు స్వస్తి!
మెదక్, మార్చి 21 (విజయక్రాంతి): ఉద్యోగుల తరహాలో ఉపాధి హామీ పథకం కూలీలకు కూడా ముఖ హాజరు విధానం అమలులోకి వచ్చింది. పనులకు కూలీలు వచ్చినప్పుడు ఫీల్ అసిస్టెంట్ వద్ద ఉన్న ఫోన్‌లో వారి కళ్లు (ఐరిష్) ఫొటో తీసి హాజరువేయాలి. ఇప్పటికే జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు ఆధార్ నెంబరు అనుసంధానంతోపాటు ఈకేవైసీ కూడా చేసి ఉన్నారు. దీంతో పనికి వచ్చిన వారి ఐరిష్ ఫోన్‌లో చూపగానే వారికి ఆటోమేటిక్‌గా హాజరు పడుతుంది.
పనులకు రాని వారికి బోగస్ మస్టర్లు వేసి పాల్పడే అవినీతికి చెక్ పడనుంది. పథకం అమలు ప్రారంభమయ్యాక చాలా సంవత్సరాలు పనికి వచ్చిన కూలీల హాజరును ఆ గ్రామంలోని ఫీల్ అసిస్టెంట్‌లు కాగితాలపై నమోదు చేసేవారు. ఆ విధానంలో భారీగా అక్రమాలు జరిగేవి. పనులకు రాని వారికి సైతం తమకు ఇష్టమైతే ఉపాధి క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు వేసేవారు.
అవేకాక అసలు పనికిరాని కొన్ని పేర్లకు లేదా తమ కుటుంబ సభ్యుల పేర్లతో మస్టర్లు వేసుకొని ఆ నగదు స్వాహా చేసేవారు. చాలాచోట్ల గ్రామ స్థాయిలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ స్థానిక నేతలు కూడా వాటాలు తీసుకునేవారు. వాటిని అరికట్టడానికి కొన్ని ప్రత్యేకమైన మార్పులు, విధానాలు తెచ్చినా అవి ఏమాత్రం అవకతకవకలను అడ్డుకోలేకపోయాయి. ఉపాధి సిబ్బంది ఏదో ఒక రూపేణా అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు.
మెదక్‌లో 3.21 లక్షల మంది కూలీలు
మెదక్ జిల్లా 1.60 లక్షల జాబ్ కార్డులను జారీ చేశారు. జాబ్ కార్డులలో 3.21లక్షల మంది కూలీలున్నారు. జిల్లాలో 2025 ఆర్థిక సంవత్సరంలో 25.27లక్షల పనిదినాలను అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకూ 20.10లక్షల పనిదినాలు పూర్తి అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ, కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోని ఎన్‌ఐసీ పరిదిలోకి వెళ్లింది. దీంతో కూలీలు 100 రోజుల వరకే పనులు చేయాల్సి ఉంటుంది.
ఒక్కరున్నా ఆన్‌లైన్ హజరే
ఎన్‌ఎంఎంఎస్ ద్వారా గతంలో 20 మంది కంటే ఎక్కువ మంది కూలీలు హాజరైతే ఆన్లైన్లో నమోదు చేసేవారు. అంతకంటే తక్కువగా ఉంటే ఈ-ఎంఎంఎస్ ద్వారా హాజరు ఉండేది. ప్రస్తుతం సంఖ్యతో పనిలేకుండా ఒక్క కూలీ ఉన్నప్పటికీ ఎంఎంఎస్ విధానం ద్వారా ఆన్లైన్ లోనే అటెండెన్స్ అప్లోడ్ చేయకపోతే కూలీలకు ఎటువంటి పేమెంట్ జరుగ దు. అలాగే పని ప్రదేశంలో రెండుసార్లు ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అక్రమాలకు అడ్డుకట్ట
ఉపాధి పథకం ప్రారంభంలో కూలీల మస్టర్ల విషయంలో గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. సోషల్ ఆడిట్ జరిగినప్పు డు పలు చోట్ల కూలీల హాజరు విషయంలోనే సమస్య ఎదురయ్యేది. కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సం ఘటనలు కూడా ఉన్నాయి.
కొంతమంది ఫీల్ అసిస్టెంట్లు తమ కుటుంబ సభ్యులు వారికి అనుకూలమైన వారు పనులకు రానప్పటికి హాజరైనట్లు చూపించి అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ-ఎంఎంఎస్ విధానం అమలులోకి రావడం తో ఇటువంటి అక్రమాలకు చెక్ పడనుంది. అయితే ఆన్లైన్ హజరు విధానం నుంచి వ్యక్తిగత పనులకు మినహాయింపు ఇచ్చారు. అంటే ప్లాంటేషన్ రీ ప్లాంటేషన్ హర్టీకల్చర్ హౌసింగ్ పనులు వంటి వాటికి ఈ మిన హాయింపు ఉంటుంది.
అందరికీ ఉపయోగకరమే
ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం అమలవుతున్న ఆన్‌లైన్ హాజరు విధానం అందరికీ ఉపయోగకరమే. మనం చేస్తున్న పను లు, హాజరవుతున్న కూలీల సంఖ్య నేరుగా ప్రభుత్వాలకు కూడా తెలుస్తుంది. అంతే కాకుండా ఎక్కడా అక్రమాలకు జరిగే వీలుండదు. పనులకు వచ్చిన వారికి న్యాయం జరుగుతుంది.
శ్రీనివాస్‌రావు, డీఆర్డీవో, మెదక్




