1 March, 2026 | 5:12 AM

తాగునీటి కష్టాలకు చెక్!

01-03-2026 12:00 AM
  1. నియో పోలీస్, కోకాపేట పరిసరాలకు గ్రావిటీ ద్వారా నీటి సరఫరా
  2. జలమండలికి నియో పోలీస్‌లో 3.95 ఎకరాల భూమి కేటాయింపు 
  3. పంపింగ్ ఖర్చులు లేకుండానే మెహిదీపట్నం, షేక్ పేట ప్రాంతాలకూ సరఫరా 
  4. గోదావరి జలాలతో మూసీ పునరుజ్జీవం దిశగా ప్రభుత్వం అడుగులు 

హైదరాబాద్,సిటీ బ్యూరో ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ పరిసరాల్లో తాగునీటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 3.95 ఎకరాల భూమిని జలమండలికి కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో నగరంలోని మెహిదీపట్నం, షేక్ పేట వంటి ప్రాంతాలకు ఎటువంటి పంపింగ్ ఖర్చు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా మంచినీటిని సరఫరా చేసే అవకాశం కలగనుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా నియో పోలీస్ వంటి ప్రాంతాల్లో భారీ భవనాలు, ఐటీ కంపెనీలు వెలుస్తుండటంతో జనాభా వేగంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఫేజ్-1,2 చేపట్టింది.

అదనంగా 300 ఎంజీడీ నీటిని తరలించడం ద్వారా అటు తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు, మూసీ నది పునరుజ్జీవానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను గోదావరి జలాలతో నింపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కోకాపేట్ నియో పోలీస్ ప్రాంతంలో ఇప్పటికే సంప్, పంప్ హౌస్ పనులు కొనసాగుతున్నాయి. అయితే, భారీ రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న భూమి సరిపోకపోవడంతో జలమండలి అదనపు భూమిని కోరింది.

ఖానాపూర్‌లో జలమండలికి ఉన్న 8.75 ఎకరాల భూమికి ఆనుకుని ఉన్న హెచ్‌ఎండీఏ భూమి 1.18 ఎకరాలు, సైట్ ఆఫీస్ భూమి 0.77 ఎకరాలు, ఆశ్రమానికి చెందిన భూమి 2.00 ఎకరాలు కలిపి మొత్తం 3.95 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ 22.5 ఎంఎల్ సామర్థ్యం గల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు, క్లోరినేషన్ గది, మెయింటెనెన్స్ యూనిట్లను నిర్మించనున్నారు. ఈ భూమి కేటాయింపు వెనుక ఒక ప్రధాన సాంకేతిక ప్రయోజనం ఉంది.

ఈ ప్రాంతం సుమారు +592 మీటర్ల ఎత్తులో ఉండటంతో, ఇక్కడ నిర్మించే రిజర్వాయర్ ద్వారా ఎటువంటి మోటార్లు వాడకుండానే పంపింగ్ అవసరం లేకుండా నీటిని సరఫరా చేయవచ్చు. దీనివల్ల నియో పోలీస్, కోకాపేట ప్రాంతాలకే కాకుండా.. నగరంలోని బోజగుట్ట రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి షేక్ పేట, రెడ్ హిల్స్, మెహిదీపట్నం, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా నీరు అందుతుంది.

ఇలా పంపింగ్ అవసరం లేకపోవడం వల్ల జలమండలికి కోట్లాది రూపాయల విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని అధికారులు వెల్లడించారు. నగరవాసులకు నిరంతరాయంగా, తక్కువ ఖర్చుతో తాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.