22 May, 2026 | 4:20 PM

ఎండిన వాగుకు జీవం పోస్తున్న చెక్ డ్యాములు

22-05-2026 03:30 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలో ఎండల తీవ్రత వల్ల గ్రామాల సమీపంలోని వాగులు ఎండి పోయాయి. జీవనదిగా పేరున్న కనుగుట్ట వాగు సహితం ఈ ఏడాది ఎండిపోయింది. రైతులు వాగు చుట్టూ విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకొని పంటలను సాగు చేసుకున్నారు. అయితే పంటలు పండి నీటి తడులు అవసరం లేకపోవడంతో తిరిగి వాగు జీవం పోస్తుంది. వాగు పైన ఐదు చోట్ల నిర్మించిన చెక్ డ్యాముల కు తిరిగి జలకల వచ్చింది. ప్రస్తుతం వాగు నీటి ప్రవాహం ప్రారంభమైంది. చెక్ డ్యాములు నిండి అలుగుపైనుండి నీరు ప్రవహించడంతో పశువులకు త్రాగునీటి లభ్యతాతో రైతులు హర్షం వ్యక్తపరుస్తున్నారు.

రైతులు తమ ఇండ్ల అవసరాల కోసం వేసుకున్న బోరు బావులు సైతం అడుగంటి పోవడంతో మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు పైనే ఆధారపడి ఉన్నారు. చెక్ డాం ల ద్వారా వాగులోకి నీరు వస్తుండడంతో తిరిగి బోరు బావుల్లోకి నీరు చేరుతుందని రైతులు అంటున్నారు. వాగు చుట్టూ ఉన్న కనుగుట్ట కౌటా గ్రామాలలో భూగర్భ జలాలు మళ్లీ పెరుగుతున్నాయి. ఏది ఏమైనా చెక్ డ్యాముల ఫలితంగా భూగర్భ జలాలు పెరుగుతున్నాయని అంటున్నారు. సోనాల మండలం చుట్టూ ఉన్న వాగు పైన సహితం చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టినట్లయితే త్రాగునీటి ఎద్దడి ఉండదని అంటున్నారు. జిల్లా అధికారులు నీటి వనరుల పెంపు కోసం చెక్ డ్యాములను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు అంటున్నారు