కరీంనగర్ కు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లు మంజూరు
తెలంగాణ చౌక్‌లో బిజెపి సంబరాలు
ముకరంపుర,(విజయ క్రాంతి): అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారించిందని బిజెపి నాయకులు తెలిపారు. మన కరీంనగర్ నగరాభివృద్ధి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో ఏకంగా రూ. 840 కోట్ల భారీ ప్యాకేజీని ఆమోదించడం పట్ల నగరంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో బిజెపి సంబరాలు నిర్వహించింది.
కరీంనగర్ అభివృద్ధికి ప్యాకేజీని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా.. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్ ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు , బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి ,బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు, నగర ప్రజలు పాల్గొన్నారు.






