25 April, 2026 | 3:22 AM

చారకొండ సింగిల్ విండో.. రాజకీయ గండమే!

25-04-2026 01:43 AM
  1. 39 ఏళ్లుగా వీడని వింత సెంటిమెంట్
  2. నామినేటెడ్ తోనైనా చైర్మన్ జాతకం మారుతుందా..?

చారకొండ, ఏప్రిల్ 24: చారకొండ రాజకీయాల్లో ఆ పదవి ఒక ’మకుటం’ లేని మహారాజు యోగం.. కానీ ఆ కుర్చీ ఎక్కిన వారికి మాత్రం అది రాజకీయంగా ఒక శాపం. మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఆ పీఠం ఎక్కిన ఉద్దండులెందరో.. కానీ పీఠం దిగాక ప్రజాప్రతినిధులుగా గెలిచింది మాత్రం ఒక్కరే. సింగిల్ విండో చైర్మన్ పదవి చేపడితే పొలిటికల్ కెరీర్కు ఎండ్ కార్డ్ పడుతుందనే భయం ఇప్పుడు స్థానిక నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను రద్దు చేసి, నామినేటెడ్ పద్ధతిని తెరపైకి తీసుకురావడంతో చారకొండ ‘ఓటమి సెంటిమెంట్‘ కు ఇకనైనా బ్రేక్ పడుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

చరిత్ర చెబుతున్న చేదు నిజం..

1987లో ఏర్పడిన ఈ సంఘానికి ఇప్పటివరకు 6 సార్లు ఎన్నికలు జరిగగా ఏడుగురు చైర్మన్ లుగా పని చేశారు. మొదటి చైర్మన్గా పనిచేసిన జెల్ల కృష్ణయ్య గౌడ్ (సీపీఐ) మొదలుకొని, మొన్నటి వరకు పనిచేసిన జెల్ల గురువయ్య గౌడ్ (బీఆర్‌ఎస్) వరకు దాదాపు అందరి పరిస్థితి ఒకేలా ఉంది. రెండో చైర్మన్ గుండె బాల్ నారాయణ గౌడ్, మూడో చైర్మన్ ఏమిరెడ్డి నారాయణ రెడ్డి, నాలుగో చైర్మన్ గజ్జె యాదయ్య గౌడ్. ఆరోవ చైర్మన్ జూలూరి రాములు గౌడ్ వీరెవరూ కూడా చైర్మన్ పదవి తర్వాత జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా గెలవలేకపోయారు. కొందరికి రాజకీయ సమీకరణాల వల్ల అసలు పోటీ చేసే అవకాశమే రాలేదు.

మినహాయింపు ఒక్క ’భీముడు’ కి మాత్రమే..

ఈ 39 ఏళ్ల చరిత్రలో ఈ వింత సెంటిమెంట్ను బ్రేక్ చేసిన ఏకైక నాయకుడు భీముడు నాయక్. ఐదో చైర్మన్గా ఎన్నికైన ఆయన, పదవిలో ఉండగానే సంవత్సరం లోపే వచ్చినా స్థానిక ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలుపొందారు. ఐదు సంవత్సరాల కాలం పూర్తి కానందుకే ఆ విజయం దక్కిందని కొందరు విశ్లేషిస్తుంటారు. ఆయన తర్వాతి కాలంలో జూలూరి రాములు గౌడ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, మళ్లీ పాత సెంటిమెంటే పునరావృతమైంది. పూర్తి కాలం చైర్మన్లుగా పనిచేసిన వారు రాజకీయంగా మరుగున పడిపోవడం ఇక్కడ గమనార్హం.

నామినేటెడ్ చైర్మన్ తోనైనా రాత మారుతుందా?..

ఎన్నికల ద్వారా పీఠం ఎక్కిన వారికే ఈ గండం వర్తిస్తుందని కొందరు నాయకులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలను రద్దు చేసి నామినేటెడ్ పద్ధతిని తీసుకురావడంతో, ఈ కొత్త విధానంతోనైనా వచ్చే నేతల జాతకమైనా మారుతుందా? లేక ఈ ’చారకొండ సెంటిమెంట్’ ఇలాగే కొనసాగుతుందా? అనేది ఇప్పుడు మండల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం ఎవరిని నామినేట్ చేస్తుంది.. వారు ఈ సెంటిమెంట్ను దాటి ముందుకు వెళ్తారా లేదా అన్నది వేచి చూడాలి.