విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.. లేకుంటే ఉద్యమాలు ఉధృతం: ఏఐఎస్ఎఫ్
అశ్వాపురం,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అశ్వాపురం మండలంలో శుక్రవారం విద్యాసంస్థల బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఈనపల్లి పవన్ సాయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం, విద్యారంగ సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేసి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులు, తల్లిదండ్రులకు నాణ్యమైన విద్యపై భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు అక్కినపల్లి నాగేంద్రబాబు, మండల నాయకులు ఈనపల్లి సిద్ధార్థ్, గద్దల వినయ్, ఈనపల్లి గణేష్, పడిదల నిఖిల్, సంజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.






