20 May, 2026 | 5:00 PM

చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

20-05-2026 03:56 PM

టియుసిఐ తుంగతుర్తి డివిజన్ అధ్యక్షులు రమేష్

తుంగతుర్తి,(విజయక్రాంతి): ఈ నెల 25వ తేదీన ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం (టియుసీఐ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్లను టియుసిఐ (ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా టియుసీఐ తుంగతుర్తి డివిజన్ అధ్యక్షులు దర్శనం రమేష్ మాట్లాడుతూ... భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25వ తేదీన, చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మికులకు పిలుపునిచ్చారు.

ఈనెల 25న విఎస్టి నుండి భారీ ప్రదర్శన, అనంతరం లేబర్ కార్యాలయం ముందు వేలాది మందితో ధర్నా నిర్వహిస్తున్నామని దానిని విజయవంతం చేయాలని కోరినారు. ఎన్నికలకు ముందు అనేక రకాల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైనాయని ఆయన ఆవేదన చెందారు.

ఎలాంటి సౌకర్యాలు లేకుండా 60 సంవత్సరాలు భవన నిర్మాణంలో పని చేసిన కార్మికులకు 9వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరినారు.  ఈ కార్యక్రమంలో నాయకులు పోలేపాక వీరయ్య, ఇరుగు ఉప్పలయ్య, ఉప్పుల మునెయ్య, గగనపల్లి ప్రదీప్, దర్శనం మణెమ్మ, వీరబోయిన నీలమ్మ తదితరులు పాల్గొన్నారు.