తాండూరులో చైన్ స్నాచింగ్
నాలుగు గంటల్లో దొంగలను అదుపులో తీసుకున్న పోలీసులు
తాండూరు, ఏప్రిల్ 7,(విజయ క్రాంతి) : వికారాబాద్ జిల్లా తాండూరులో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి ఒకరి మెడలో నుండి బంగారు గొలుసు లాక్కొని ...మరో మహిళ మెడలో నుండి బంగారు గొలుసు గొలుసును లాక్కునేందుకు యత్నించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం యాలాల మండల పరిధిలోని కోకట్ రోడ్డు సంగమేశ్వర కాలనీ కి చెందిన శామమ్మ అనే మహిళ మెడలో నుండి గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు రెండు తులాల బంగారం గొలుసు లాక్కుని పారిపోయారు.
అనంతరం పట్టణంలోని ఆదర్శనగర్ ప్రాంతంలో మహిళ బస్సు కండక్టర్ విధులు ముగించుకొని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా చైన్ స్నాచర్స్ ఆమె మెడలో నుండి బంగారం గొలుసు లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. ఆమె కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుండి పారిపోయారు. వెంటనే ఆమె 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. అప్పటికి శ్యామమ్మ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది.
పోలీసులు రంగంలోకి దిగి సి సి ఫుటేజీ ఆధారంగా నిందితులు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వెళుతున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే బస్సు డిపో మేనేజర్ తో మాట్లాడి డ్రైవర్, కండక్టర్ కు అప్రమత్తం చేశారు. అప్పటికే బస్సు మన్నెగూడ చౌరస్తా దాటిపోయింది.
మొయినాబాద్ పోలీసులకు సమాచారం చేరడంతో బస్సు మొయినాబాద్ కు చేరుకోగానే పోలీసులు ముట్టడించారు. బస్సులో ఉన్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకునగా మరో వ్యక్తి కూడా ఉన్నాడని తెలపడంతో అతడిని కూడా అరెస్టు చేశారు. నిందితులను యాలాల పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




