సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా రిటైల్ అవుట్‌రీచ్
హైదరాబాద్ రీజియన్‌లో కార్యక్రమ నిర్వహణ
హైదరాబాద్, ఆగస్టు 21(విజయక్రాంతి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో రిటైల్ రుణ వ్యాపారాన్ని బలోపేతం చేయడం, ఖాతాదారులతో మరింత సన్నిహిత సంబంధాలను ఏర్పరచడం, వ్యాపార వృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా మెగా రిటైల్ అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ ఏ. డి. శ్రీనివాస్, హైదరాబాద్ రీజినల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్, విలువైన ఖాతాదారులు, బ్యాంకు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్యాంకు గృహలక్ష్మి హౌసింగ్ లోన్స్, హోమ్ లోన్స్, గోల్ లోన్స్, వెహికల్ లోన్స్ తదితర రిటైల్ రుణ పథకాలపై ఆకర్షణీయమైన, పోటీ వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమై రిటైల్ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
మెగా రిటైల్ అవుట్‌రీచ్ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ రీజియన్ గణనీయమైన వ్యాపార ఫలితాలను సాధించింది. ప్రచార కాలంలో ఇన్-ప్రిన్సిపల్ ఆమోదాలతో కలిపి మొత్తం రూ.172 కోట్ల రిటైల్ రుణాలు మంజూరు చేయగా, అందులో రూ.125 కోట్ల రుణాలు పంపిణీ చేయబడ్డాయి. అదనంగా రూ.24 కోట్ల విలువైన తాజా వ్యాపార అవకాశాలు (లీడ్స్) కూడా సేకరించబడ్డాయి.






