22 August, 2026 | 2:45 AM

గాంధీభవన్‌కు చిన్నన్న.. ఢిల్లీకి మేఘన్న!

22-08-2026 02:04 AM
  1. రోజురోజుకూ ముదురుతున్న కాంగ్రెస్ పంచాయతీ.. రాజధాని దాటి ఢిల్లీకి!
  2. బలబలాల ప్రదర్శనలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి 
  3. హైకమాండ్ నిర్ణయంపైనే అందరి చూపు

వనపర్తి, ఆగస్టు 21 (విజయక్రాంతి): వనపర్తి కాంగ్రెస్లో మొదలైన అంతర్గత పంచాయతీ ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాటి దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎవరి మాట నెగ్గుతుంది..? అధిష్ఠానం ఎవరికి అండగా నిలుస్తుంది..? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.

ఇటీవల ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఎంపీ మల్లు రవిలను వేర్వేరుగా కలిసి తమ అభిప్రాయాలు, వినతులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడం వివాదాన్ని మరింత వేడెక్కించింది.

గాంధీభవన్‌కు చిన్నన్న..

ఈ పరిణామాల నడుమ శుక్రవారం చిన్నారెడ్డి తన వర్గానికి చెందిన నాయకులతో కలిసి గాంధీభవన్ బాట పట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తన వెంట ఉన్న నాయకుల బలాన్ని ప్రదర్శిస్తూ అధిష్ఠానానికి తన రాజకీయ ప్రాధాన్యతను చాటే ప్రయత్నమా..? అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది.

చిన్నారెడ్డి వెంట పెద్ద సంఖ్యలో నాయకులు, అనుచరులు గాంధీభవన్కు చేరుకోవడం వనపర్తి రాజకీయాల్లో ఆసక్తిని పెంచింది. ఇంతకాలం స్థానికంగా సాగిన విభేదాలు ఇప్పుడు పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి చేరడంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ బాట పట్టిన మేఘన్న..

మరోవైపు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన ముఖ్య అనుచరులు, వర్గీయులతో కలిసి ఢిల్లీకి బయలుదేరడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కాని అంశాలను నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకే ఢిల్లీ పర్యటన అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ఒకవైపు చిన్నారెడ్డి గాంధీభవన్లో తన బలాన్ని చాటుతుండగా.. మరోవైపు మేఘారెడ్డి ఢిల్లీ వేదికగా తన వాదనను వినిపించేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ సాగుతోంది.

వనపర్తి కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారా..?

వనపర్తి కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాటి దేశ రాజధాని ఢిల్లీకి చేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలు తమ తమ బలాలను ప్రదర్శిస్తూ వేర్వేరు వేదికలపై తమ వాదనలు వినిపించేందుకు ప్రయత్నిం చడం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని పెంచుతోంది. స్థానికంగా మొదలైన పంచాయతీ.. జిల్లా స్థాయిలో వేడెక్కి.. రాష్ట్ర స్థాయిని దాటి ఢిల్లీకి చేరడం వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.

సర్దుబాటా..? సమరమా..? 

ఇప్పటి వరకు మాటల యుద్ధంగా సాగిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ ఇప్పుడు అధిష్ఠానం ముందుకు చేరడంతో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఇరువర్గాలను సమన్వయం చేసి సర్దుబాటు ఫార్ములా అమలు చేస్తారా..? లేక ఒక వర్గం వైపు అధిష్ఠానం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందా..? అన్నది ప్రశ్నగా మారింది. చిన్నారెడ్డిమేఘారెడ్డి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలకు కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి ముగింపు పలుకుతుందోనన్న ఆసక్తి వనపర్తి కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది. చివరకు సర్దుబాటు జరుగుతుందా..? లేక ఆధిపత్య పోరు మరింత ముదురుతుందా..? వనపర్తి కాంగ్రెస్లో ఎవరిదీ పైచేయి అవుతుంది..? చిన్నన్నదా..? మేఘన్నదా..? ఇదే ఇప్పుడు వనపర్తి రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది.