పూర్తిగా డిజిటల్ విధానంలో జనగణన
ఐటీడీఏ పీఓ యువరాజ్
ఆదిలాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): దేశాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు పకడ్బందీగా జరిగే జనగణనే దిక్సూచిగా ఉంటుందని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీఓ) యువరాజ్ మర్మాటే అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన భారత జనగణన 2027కు సంబంధించిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారుల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాజేశ్వర్తో కలిసి ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా ఈసారి జనగణనను పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్ ద్వారా గణన చేపట్టడంతో పాటు, ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గణన ప్రారంభానికి 15 రోజుల ముందే ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి రానుంది.
ఈ శిక్షణా కార్యక్రమంలో హైదరాబాద్ జనాభా గణన విభాగం గణాంక అధికారులు ఆదెపు వినయ్, జంగయ్యలు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలు, వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. మార్చి 13 వరకు ఈ శిక్షణ కొనసాగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రవీందర్ రాథోడ్, డీపీఓ రమేష్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




