నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి: మల్కాజిగిరి సీపీ సుమతి
ఘట్ కేసర్, జూలై 7 (విజయక్రాంతి) : ఒక్క సీసీ కెమెరా వందమందితో సమానమనీ, నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోశిస్తాయని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో వంద సీసీటీవీ కెమెరాలను పోలీస్ కమీషనర్ సుమతి ప్రారంభిచారు. ఈసందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ... మీసురక్ష నేను సైతం 2.O లో భాగంగా ప్రజలకు భద్రత అందించేలా ఒకే రోజు మల్కాజిగిరి కమీషనరేట్ పరిధిలో మూడు వేల సీసీటీవీ కెమెరా లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. నేరాల నియంత్రణ కోసం ప్రజల సహకారం కూడా ముఖ్యమనీ, తమ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సీసీటీవీ కెమెరా లను పెట్టుకోవడం వల్ల నేరాలను అదుపు చేయడం, నేరస్తులను పట్టుకుని శిక్షించడం జరుగుతుందన్నారు.
కమీషనరేట్ పరిధిలో మొత్తం 2,45,035 సీసీ కెమెరాలు ఉన్నాయనీ, ఈ సంవత్సరం 16,339 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈసంవత్సరం 214 కేసులను సీసీ కెమెరాల సాయంతో పరిష్కరించడం జరిగిందనీ, లండన్ లో ఉన్న డ్రోన్ పెట్రోలింగ్ సిస్టం ను మల్కాజిగిరి పోలీస్ కమీషనరేట్ లోని ఉప్పల్ పీఎస్ పరిధిలో ప్రారంభించామన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ లకు డ్రోన్ పెట్రోలింగ్ ను విస్తరిస్తామని సీపీ సుమతి పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల రక్షణకు ఈ నిఘా వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కెమెరాల దృశ్యాలను స్థానిక పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయడం ద్వారా 24 గంటలూ నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన స్థానికులను కమిషనర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సురేష్ కుమార్, అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీ బిట్టు మోహన్, సీఐలు కనకయ్యగౌడ్, బాలస్వామి, ఎస్ఐలు నాగేశ్వరరావు, కృష్ణయ్య, శివకృష్ణ, రాజు, విజయ్ భాస్కర్ రెడ్డి, విజయకృష్ణ పాల్గొన్నారు.






