ఎమ్మెల్సీల నియామకం విచారణ వాయిదా
- గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై సుప్రీంలో విచారణ
- తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అటార్నీ జనరల్
- సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం
- జూలై 22వ తేదీకి వాయిదా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జూలై 22వ తేదీకి వాయిదా పడింది. జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై దాసోజు శ్రవణ్ సహా మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఇరుపక్షాల వా దనలు విన్న సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వం కొత్తగా సిఫార్సు చేసిన అభ్యర్థులపై నిర్ణ యం తీసుకునేందుకు గవర్నర్‌కు మరికొంత సమయం కావాలని అటార్నీ జనరల్ వెంకటరమణి కోరారు. ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేసిన ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్‌ల నియామకంపై కొత్త గవర్నర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ధర్మాసనానికి వివరించారు.
ఈ నెల 31తో ఆరు నెలల గడువు ముగుస్తున్నందున, గవర్నర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ విచారణను కొనసాగించాలా? ముగించాలా? అన్నది తేలుతుందని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రావ ణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయగా, అప్పటి గవర్నర్ తమిళిసై ఆ ఫైల్‌ను తిరస్కరించారు.
దీన్ని సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ కోర్టును ఆశ్రయిం చింది. పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్త వారిని నియమించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని గతంలోనే జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ మేరకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత సిఫా ర్సులను పక్కన పెట్టి, కొత్త నోటిఫికేషన్ ద్వారా కోదండరాం, అజారుద్దీన్‌ల పేర్లను ప్రతిపాదించింది. కాగా మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 30తో ఆరు నెలలు ముగిస్తుంది.
రాజ్యాంగం ప్రకారం మంత్రిగా కొనసాగాలంటే శాసనసభ లేదా శాసనమండలి సభ్యుడిగా ఉండడం తప్పనిసరి. అయితే ఏ సభలోనూ సభ్యుడు కాకుండా మంత్రిగా ఆరు నెలలు కొనసాగే అవకాశం ఉంటుంది. గడువు ముగిసేలోగా ఏదో ఒక సభలో సభ్యుడు కావడం అనివార్యం. దీంతో ఎమ్మెల్సీగా గవర్నర్ ఈ నెల 30లోగా నిర్ణయం తీసుకోవడం తప్పనిసరిగా మారింది. వీరి నియామకంపై కొత్త గవర్నర్ నిర్ణయం వెలువడితే ఈ న్యాయపరమైన చిక్కులు తొలగిపోయే అవకాశం ఉంది.






