11 May, 2026 | 3:40 AM

ప్రధాని పర్యటనను నిరసిస్తూ సీసీఐ సాధన సమితి ఆందోళన

11-05-2026 12:00 AM

సీసీఐని పునరుద్ధరించాలి... లేదా భూములను అప్పగించాలని డిమాండ్

ఆదిలాబాద్, మే 10 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ లో మూతపడిన సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణపై స్పష్టతనివ్వాలని సీసీఐ సాధన కమిటి డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ ఆదివారం సాధన సమితి సభ్యులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని బస్టాండ్ ఎదుట పాత జాతీయ రహదారిపై ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. నిరసన నినాదాలతో హోరెత్తించారు.

ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిమెంటు పరిశ్రమను పునరుద్దరిస్తామని గత ఎన్నికల సందర్భంగా బీజేపీ హమీ ఇచ్చి మోసం చేసిందన్నారు. ఎన్నికల ప్రచారం లో బాగంగా జిల్లాకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం బీజేపీ ని గెలిపిస్తే సిమెంట్ ఫాక్టరీ ను పునరుద్దరిస్తామని మాట ఇచ్చి గెలిచిన తరువాత ఊనెత్తడం లేదని మండిపడ్డారు.

జిల్లా ప్రజలు రెండు సార్లు బీజేపీ ఎంపీ ని, ఎమ్మెల్యే లను గెలిపించినా ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోక పోగా.. ఉన్న పరిశ్రమను తుక్కు కింద విక్రయించేందుకు సిద్ధపడుతోందని మండిపడ్డారు. పరిశ్రమను పునరుద్దరించాలని లేదా భూ నిర్వాసితులకు పరిశ్రమ భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సాధన కమిటి నాయకులు బండి దత్తాత్రి, లోకారి పోశెట్టి,దాసరి రమేష్, జగన్ సింగ్, ఈశ్వర్ రావ్, పూసం సచిన్, మంజుల, సుభాష్, శివ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.