జగిత్యాల పట్టణంలో ఉద్రిక్తత
- బీజేపీ ధర్మదీక్షకు అనుమతి నిరాకరణ
- ఆందోళనకు దిగిన పార్టీశ్రేణులు
జగిత్యాల, మే 16 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నెల 18న నిర్వహించనున్న ఎంపీ ధర్మపురి అ ర్వింద్ ధర్మదీక్షకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద బీజేపీ జగిత్యాల ని యోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ భోగ శ్రావణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
ప్రభుత్వం కావాలనే కేంద్రీయ విద్యాలయ ఏర్పాటును అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డాక్టర్ భోగ శ్రావణితో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా బీజేపీ కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.






