అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
52 ఆవులను రక్షించిన చిట్యాల పోలీసులు
చిట్యాల, మే 11 : చిట్యాల రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్ వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని చిట్యాల పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. చిట్యాల పోలీసులు రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న టీజీ 12 యూ 6043 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో గోవులను నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి సరైన రవాణా అనుమతులు లేకుండా హైదరాబాద్ వైపు తరలిస్తున్నట్లు గుర్తించారు.
పోలీసుల పరిశీలనలో లారీలో మొత్తం 52 ఆవులను అత్యంత ఇరుకుగా, క్రూరంగా కుక్కి తరలిస్తున్నట్లు బయటపడింది. దీంతో వెంటనే లారీని స్వాధీనం చేసుకున్న పోలీసులు గోవులను రక్షించి చింతపల్లి గోశాలకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి లారీ డ్రైవర్ మున్నా (తండ్రి అబ్దుల్ రెహ్మాన్, ఉత్తరప్రదేశ్ నివాసి)తో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ కే.నాగరాజు తెలిపారు. చిట్యాల ఎస్‌ఐ ఎం. రవి కుమార్, మార్కెట్ పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి పోలీస్ సిబ్బంది ఉన్నారు.






