12 May, 2026 | 2:06 AM

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం

12-05-2026 01:03 AM

కలెక్టరేట్ ముందు బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల ధర్నా

నల్లగొండ, మే 11 (విజయక్రాంతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అన్యాయం జరుగుతుందని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్‌ఎస్  పార్టీ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం తరలించేందుకు సరిపడా లారీలు లేక వడ్లు రోజుల తరబడి కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయని అన్నారు.

తేమ, నాణ్యత పేరుతో రైతుల వడ్లలో అన్యాయ కోతలు విధిస్తున్నారని, దళారులు తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంటాలు ఆలస్యం కావడంతో రైతులు ఎండలో, వర్షంలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, తాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని, కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కాంటాలు నిర్వహించాలని, సరిపడా లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే తరలించాలని, దళారుల దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ విషయంపై స్పందించిన జాయింట్ కలెక్టర్, 15 రోజుల్లోపు జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.