8 July, 2026 | 3:29 AM

బూట్లు.. దుస్తుల్లో దాచి నగదు చోరీ

08-07-2026 01:28 AM
  1. సీసీటీవీ ఫుటేజీలో బట్టబయలైన సిబ్బంది చేతివాటం
  2. ౩౯ రోజుల్లో 70 సార్లు దొంగతనం
  3. రామ్‌మందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు
  4. మౌనాన్ని వీడిన చంపత్ రాయ్.. మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా బాగోతాలు వెలుగులోకి

లక్నో, జూలై ౭: అయోధ్య రామ్‌మందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రోజుకో విషయాన్ని బయటపెడుతున్నది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు ఆలయ పరిధిలో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ చేపట్టిన విరాళాల లెక్కింపును సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి, నిందితులు ఎలా నగదు, ఆభరణాలు ఆపహరించారనే వీడియోపరమైన ఆధారాలు సేకరించింది. కొందరు సిబ్బంది ఆభరణాలను, కరెన్సీ నోట్లను, చిల్లరను తమ దుస్తులు, జేబులు, బూట్లలో దాచి, బయటకు తరలించారని నిర్ధారించింది.

౩౯ రోజుల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది 70 సార్లు దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చింది. ట్రస్ట్ సభ్యులు, ఆలయ యంత్రాంగం సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించకపోవడంపై సిట్ విస్మయం వ్యక్తం చేసింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ట్రస్ట్ సభ్యులు, బ్యాంకు అధికారులు, భద్రతా సిబ్బంది, లెక్కింపు సిబ్బందిని విచారించింది. వారి వాంగ్మూలాల ప్రకారం ఏప్రిల్ 27 వ తేదీకి ముందు కూడా విరాళాల చోరీ జరిగి ఉండొచ్చని అంచనా ఉంది. కానీ, ఆ రోజుకు ముందు పాత సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడంతో ఆధారాల సేకరణకు సవాలుగా మారింది. 

దర్యాప్తు వేగవంతం

అయోధ్య రామ్‌మందిర విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. యూపీ పోలీసులసాయంతో ముందుకు వెళ్తున్నది. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్టయ్యారు. మరోవైపు, శ్రీరామజన్మభూమి ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శిగా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన కృష్ణమోహన్ నిధుల చోరీ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమాల వెనుక ఉన్నవారికి శిక్షపడేలా చేస్తామని తాజాగా ప్రకటించారు.

చోరీ ఘటనలు పునరావృతం కాకుండా లోపాలను సరిదిద్దుతామని తెలిపారు. పారదర్శకంగా, జవాబుదారీగా ఆలయ నిధుల నిర్వహణే ప్రస్తుతం తమముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. ఇంకోవైపు, నిధుల చోరీపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేపట్టాలని యూపీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతున్నాయి.

పోలీస్ కస్టడీకి ముగ్గురు నిందితులు

విరాళాల చోరీలో నిందితులుగా ఉన్న లవ్ కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా, కరుణేష్ పాండేకు మంగళవారం అయోధ్య కోర్టు 40 గంటల పోలీస్ కస్టడీ విధించింది. బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నిందితులను విచారించనున్నారు. కస్టడీ విచారణలో భాగంగా సిట్ అధికారుల బృందం నిందితులను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి ఆధారాలను సేకరించనుంది. అనుకల్ప్ మిశ్రా ఇటీవల కొనుగోలు చేసిన ఇల్లు, వాహనంపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.అలాగే, ముగ్గురు నిందితుల నగదు లావాదేవీలు, కీలక ఆధారాల సేకరణపైనే విచారణ సాగనుంది.

విస్తుపోయేలా చంపత్‌రాయ్ వివరణ

అయోధ్య రామాలయ విరాళాల లెక్కింపు అక్రమాలపై శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎట్టకేలకు మౌనం వీడారు. పదవి నుంచి తప్పుకొన్న తర్వాత తాజాగా ఆయన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించారు. విరాళాల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఒప్పందాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వివాదంలో మాజీ ట్రస్ట్ ట్రెజరర్ అనిల్ మిశ్రాతో పాటు లెక్కింపులో పాల్గొన్న బ్యాంక్ పాత్రపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

గతేడాది ఫిబ్రవరి 6 నాటి ‘జాయింట్ గైడ్‌లైన్స్ ఫర్ ది కౌంటింగ్ ప్రాసెస్’ డాక్యుమెంట్‌తో తాను విభేదిస్తున్నట్లు వివరణలో పేర్కొన్నారు. డాక్యుమెంట్‌లో అనిల్‌మిశ్రా, అప్పటి సీబీఐ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గోవింద్ మిశ్రా సంతకాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. కొన్ని ఒప్పందాలపై తన అనుమతి లేకుండానే అనిల్ మిశ్రా కొన్ని బ్యాంకు ఒప్పందాలపై సంతకం చేశారని స్పష్టం చేశారు. అలాగే, ఇంకెన్నో ఒప్పందాలు కూడా అలాగే జరిగాయని వివరణ ఇచ్చారు.

ఒప్పందాల ప్రకారం నగదు, ఆభరణాల లెక్కింపు జరిగే ప్రదేశంలో సీసీటీవీ నిఘా, ఐరన్ తలుపులు వంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అవేమీ జరగలేదని వాపోయారు. సిబ్బందికి జేబులు లేని యూనిఫాం ఇవ్వాల్సి ఉండగా, అది కూడా జరగలేదని వెల్లడించారు. నగదు లెక్కింపు కోసం హౌస్‌కీపింగ్ సిబ్బందిని ఉపయోగించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.