8 July, 2026 | 3:01 AM

వయనాడ్‌లో క్లౌడ్ బరస్ట్

08-07-2026 01:26 AM
  1. విరిగిపడ్డ కొండచరియలు
  2. ఐదుగురి మృతి, ఏడుగురి గల్లంతు
  3. సహాయక చర్యల్లో రెస్క్యూ బృందాలు
  4. ఉప్పొంగి ప్రవహిస్తున్న మీనాక్షి నది
  5. ఎంపీలు ప్రియాంక, రాహుల్ గాంధీ సంతాపం

తిరువనంతపురం, జూలై 7: కేరళ వయనాడ్‌లో క్లౌడ్ బరస్ట్ అయ్యింది. కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. మంగళవారం అనక్కం పొయిల్ మెప్పాడి గ్రామ పంచాయతీ పరిధిలోని కల్లాడి సొరంగం వద్ద కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు మృతి చెందగా, శిథిలాల కింద 30 మంది వరకు చిక్కుకున్నారు. రెస్క్యూ బృందాలు, స్థానికులు శ్రమించి కొండచరియల కింద చిక్కుకున్న కొంతమందిని కాపాడి స్థానిక ఆసుపత్రికి తరలించారు.

గల్లంతైన ఏడుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మలప్పురం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మీనాక్షి వంతెన వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. బాధితులంతా సొరంగం పనుల్లో పాలు పంచుకుంటున్న కార్మికులు, పర్యవేక్షక సిబ్బంది అని అధికారులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఐసీ బాలకృష్ణన్, స్థానిక అధికారులు పెద్ద ఎత్తున సమావేశమై స్థానికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించారు.

మీనాక్షి వంతెనకు ఇరువైపుల ఉన్న ప్రజలను ఖాళీ చేయించి తాత్కాలిక ఆశ్రయాల్లోకి తరలిస్తున్నారు. కేరళకు కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి గోపీ ప్రకటించారు. కేంద్రం సహాయం కోరే ముందు పరిస్థితులను అంచనా వేస్తామని కేరళ ముఖ్య కార్యదర్శి బిశ్వనాథ్ సిన్హా ప్రకటించారు. కాగా వరదలు, కొండచరియలు విరిగిపడి పలువురు మృతి చెందడం పట్ల వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్థానిక అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో వేగం పెంచాలని అధికారులను కోరారు. ఎఐసీసీ సీనియర్ ఎంపీ రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.