8 July, 2026 | 2:26 AM

మోదీకి ఇండోనేషియాఅత్యున్నత పురస్కారం

08-07-2026 01:33 AM
  1. ‘బింతాంగ్ ఆదిపూర్ణ’ మెడల్ బహూకరణ
  2. భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక బంధాలకు ఇది స్వర్ణయుగం: మోదీ
  3. ఇండోనేషియాకు భారత పైలట్ బిజూ పట్నాయక్ సేవలను గుర్తుచేసిన ప్రధాని
  4. ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణులు అందించేందుకు ఒప్పందం

జకర్తా, జూలై ౭: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పురస్కారం అందజేసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోదీ ముఖ్యభూమిక పోషిస్తున్నందుకు గానను ఆ దేశం ‘బింతాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ పతకాన్ని బహూకరించింది. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ తొలుత జకార్తా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

అక్కడ ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా నలుగురు మంత్రులతో కలిసి వచ్చి మోదీకి ఘనస్వాగతం పలికారు. అక్కడి వైమానిక దళ ఫైటర్ జెట్స్, సైన్యం మోదీకి గౌరవ వందనం చేసింది. అనంతరం ఆ దేశ పార్లమెంట్‌లో మోదీ ప్రసంగించారు. భారత్, ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇదొక స్వర్ణయుగమని అభివర్ణించారు. భారత్ పంథా ఎల్లప్పుడూ అభివృద్ధి పంథానేనని ఉద్ఘాటించారు. తమ దేశానికి విలసవాదం ఎప్పటికీ కాబోదని స్పష్టం చేశారు.

‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ అనే తారకమంత్రంతోనే దేశం ముందుకు సాగుతుందని వివరించారు. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవో తనలో భారత డీఎన్‌ఏ ఉందని పేర్కొని, ౧౪౦ కోట్ల భారతీయుల మనసులను గెలుచుకున్నారని కీర్తించారు. రెండు దేశాల రాజధానులు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, గ్రేట్ నికోబార్ ఐలాండ్ నుంచి ఇండోనేషియాకు చెందిన అచే ప్రాంతం కేవలం 150 కిలోమీటర్ల దూరంలోనే ఉందని గుర్తుచేశారు.

బాలీవుడ్ చిత్రం ‘కుచ్ కుచ్ హోతా హై’ ఇండోనేషియాలో ప్రసిద్ధమైందని, భారత్  -ఇండోనేషియా కలిస్తే ‘బహుత్ కుచ్ హోతా హై’ (ఎంకెంతో చేయవచ్చు) అంటూ చమత్కరించారు. ఐఐఎం బెంగళూరు తన మొదటి ఓవర్సీస్ క్యాంపస్‌ను ఇండోనేషియాలో ఏర్పాటు చేయడం విశేషమని పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

మోదీ ప్రసంగం అనంతరం రెండు దేశాల మధ్య దాదాపు డజనుకు పైగా కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణులను అందించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ అంశంపై రక్షణ రంగ ఒప్పందం కుదిరింది. అలాగే, మ్యారైటైమ్ సెక్యూరిటీ పెంపు, క్రిటికల్ మినరల్ సరఫరా వ్యవస్థ బలోపేతంపైనా ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఫుడ్ సెక్యూరిటీ, మెడిసిన్స్, టెక్నాలజీ రంగాల్లో పరస్పర సహకారంపైనా ఒప్పందాలు జరిగాయి.

యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రాంబనన్ టెంపుల్ కాంప్లెక్స్ పునరుద్ధరణకు భారత్ సహాయం చేయనుంది. ఉగ్రవాదంపై ఇరు దేశాలు జీరో టాలరెన్స్‌ను ఇదే వేదికపై ప్రకటించాయి. ఉగ్రవాదానికి నిధుల నిలుపుదల, ఆన్‌లైన్ రాడికలైజేషన్‌ను అడ్డుకునేందుకు భద్రతాపరమైన సంప్రదింపుల ద్వారా కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 

బిజూ పట్నాయక్‌పై మోదీ ప్రశంసల జల్లు

ఇండోనేషియా స్వాతంత్య్ర పోరాటంలో భారత పైలట్ బిజూ పట్నాయక్ కీలకమైన పాత్ర పోషించారని భారత ప్రధాని మోదీ కొనియాడారు. 1946లో డచ్ సైన్యం జావాపై దాడి చేసినప్పుడు బిజూ ఇండోనేషియా స్వతంత్ర సమరయోధులను కాపాడుకునేందుకు నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సాయం కోరారని గుర్తుచేశారు. ఆ సమయంలో ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణోను డచ్ ప్రభుత్వం గహనిర్బంధంలో ఉంచిందని తెలిపారు.

నెహ్రూ పిలుపునకు స్పందించిన బిజూ పట్నాయక్, తన భార్య జ్ఞాన్‌తో కలిసి డగ్లస్ డకోటా విమానంలో యుద్ధ ప్రాంతానికి వెళ్లారని పేర్కొన్నారు. నాటి ఇండోనేషియా ప్రధాని సుతాన్ సజహ్రీర్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్‌ను సురక్షితంగా రక్షించి, బిజూ ప్రత్యేక విమానంలో భారతదేశానికి తీసుకువచ్చారని కొనియాడారు.

ఆ సమయంలో సింగపూర్ నుంచి జావా వెళ్తున్న విమానాన్ని కూల్చేస్తామని డచ్ సైన్యం బెదిరించిందని, అయినప్పటికీ.. బిజూ బెదరకుండా తన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు. ఆయన సాహసానికి గుర్తింపుగా ఇండోనేషియా ప్రభుత్వం 1955లో బిజూకు దేశ అత్యున్నత పురస్కారమైన ‘బింతాంగ్ జసా ఉతమ’ను ప్రకటించిందని తెలిపారు. బిజూ తర్వాత తమ దేశంలోని ఒడిశా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారని కొనియాడారు.