19-02-2026 02:09:00 AM
ఖానాపూర్‌లో చైర్మన్ పదవి తొలి రెండేళ్లు బీఆర్‌ఎస్‌కు, తర్వాత మూడేళ్లు బీజేపీకి
చెరో రెండు కోఆప్షన్ సభ్యులను పంచుకున్న పార్టీలు
ఖానాపూర్/హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్‌పై కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలు, వేసిన ఎత్తుగడలు బెడిసికొట్టాయి. పదవులను పంచుకునేలా బీఆర్‌ఎస్, బీజేపీ జోడీ కట్టడంతో తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో నాలుగు స్థానాల చొప్పున దక్కించుకున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్), భారతీయ జనతా పార్టీ(బీజేపీ) చైర్మన్, వైస్‌చైర్మన్ పదవుల పంపకానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు బుధవారం పార్టీ నేతలు ప్రకటించారు.
దీంతో ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆశలకు గండి కొట్టారు. ఖానాపూర్ మున్సిపపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 3, బీజేపీకి 4, బీఆర్‌ఎస్‌కి 4, ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడంతో మూడు పార్టీలకు సమానంగా సీట్లు వచ్చాయి. దీంతో పొత్తులు కుదరక చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్‌ఎస్‌లో చీలిక తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు సాగించిన ఆ పార్టీ నేతలు ఒప్పుకోకపోవడంతో అధికార పార్టీ విఫలమయింది. అయితే మొదటగా బీఆర్‌ఎస్‌కు చైర్మన్ పదవి రెండేళ్లు, ఆ తర్వాత బీజేపీకి మూడేళ్లపాటు పంచుకుంటూ రెండు పార్టీలూ ఒప్పందం చేసుకున్నాయి. 4 కో ఆప్షన్ సభ్యుల విషయంలో ఇరు పార్టీలకు రెండు చొప్పున కేటాయించారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సంప్రదింపుల అనంతరం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇరు పార్టీల నేతలు ప్రక టించారు. అధికార పార్టీకి అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు కరారు కావడం పదవుల పంపిణీ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ వైస్‌చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తే వీరికే పదవులు దక్కనున్నాయి. దీంతో కాంగ్రెస్‌కు నిరాశే కలగనుంది.