21-02-2026 12:25:18 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతాంగానికి సాగునీరు అందించడానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దేవాదుల మూడో ఫేజ్ పనులను 99 శాతం పూర్తి చేసిందని, కేవలం ఒక శాతం పనులు మాత్రమే మిగిలి ఉండగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలుగా ఒక్క అంగుళం కూడా ముందుకు తీసుకెళ్ల లేకపోయిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు.
రూ.8 కోట్ల భీమ్ ఘన్‌పూర్ మెయింటెనెన్స్ చార్జీ చెల్లించలేని దుస్థితిలో ఉన్నదని, సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా దేవన్నపేట పంప్‌హౌస్ వద్ద శుక్రవారం పనులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 49.5 కిలో మీటర్ల దూరంలో రామప్ప నుంచి ఉనికిచర్ల వరకు నిర్మించిన ఏకైక ‘సింగిల్ లార్జెస్ట్ ఇరిగేషన్ టన్నెల్’ గా గుర్తింపు పొందిందన్నారు.
అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిందన్నారు. అటువంటి ప్రాజెక్టును ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాదుల ప్రాజెక్టు కోసం రూ.7,300 కోట్లు ఖర్చు చేసి 99శాతం పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. సాగునీటి ఆయకట్టును 47 వేల నుంచి 3.17 లక్షల ఎకరాలకు పెంచడమే కాకుండా, అవసరమైన 33 వేల ఎకరాల భూసేకరణలో ఇప్పటికే 30 వేల ఎకరాలను పూర్తి చేశామని తెలిపారు.
మరో రూ.1,000 నుంచి రూ.2,000 కోట్లు ఖర్చు చేస్తే మరో 2.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లయినా కనీసం 100 కోట్లు కూడా కేటాయించలేదని హరీశ్‌రావు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియగానే రైతుభరోసా వేస్తామని చెప్పి, 20వ తేదీ వచ్చినా అతీగతీ లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులున్నారు.