calender_icon.png 5 February, 2026 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలి

05-02-2026 12:17:03 AM

జిల్లా అదనపు ఎన్నికల అధికారి, మధుమోహన్ 

కామారెడ్డి, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటించాలని జిల్లా ఆదనపు ఎన్నికల అధికారి మధుమోహన్ అన్నారు. బుధవారం రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా  కళాభారతి భవన్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం నిర్వహించిన సమావేశంలో  అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మధుమోహన్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ ఎన్నికల నిబంధనలపై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుండి ఫలితాలు ప్రకటించే తేదీ వరకు చేసిన ఎన్నికల ఖర్చులన్నింటినీ ప్రతిరోజూ ఖచ్చితంగా లెక్కలలో నమోదు చేయాలని, రిటర్నింగ్ అధికారి అందజేసిన ఖర్చుల రిజిస్టర్లో బిల్లులు, వోచర్లు, రసీదులతో సహా నమోదు చేయాలని సూచించారు. నిర్ణీత తేదీల్లో ఖర్చుల ఖాతాలను వ్యయ పరిశీలకుడు లేదా అధీకృత అధికారికి తనిఖీ కోసం సమర్పించాల్సిందిగా తెలిపారు. అనుమతి లేకుండా వాహనాలు లేదా లౌడ్ స్పీకర్లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని, అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను నిర్ణీత ఫార్మాట్లలో నియమించుకుని, రిటర్నింగ్ అధికారి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే విధులు నిర్వహించాలని తెలిపారు.

పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులు జారీ చేసే సూచనలు, ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను కచ్చితంగా అమలు చేయాలని అన్నారు, మోడల్ కోడ్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ఫలితాలు ప్రకటించిన తర్వాత చట్టబద్ధమైన వ్యవధిలోపు ఎన్నికల వ్యయ ఖాతాల తుది లెక్కలను సమర్పించాలని తెలిపారు. ఎన్నికల నిబంధనలపై ఏవైనా సందేహాలుంటే రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని సంప్రదించవచ్చని  తెలిపారు.ఈ సమావేశంలో కామారెడ్డి ఆర్డీవో వీణ, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ , అకౌంట్స్ విభాగం సిబ్బంది, తహసీల్దార్ కామారెడ్డిలతో పాటు  పోటీ చేసే అభ్యర్థులు పాల్గొన్నారు.