13-02-2026 12:31:01 AM
నిజామాబాద్/ఆదిలాబాద్/మంచిర్యాల/సూర్యాపేట, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రి య ముగిసిందో లేదో వెంటనే ఆయా రాజకీయ పార్టీల్లో క్యాంపు రాజకీయాలు మొద లయ్యాయి. కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు క్యాంప్‌లకు తరలించాయి. ఈ నెల 11వ తేదీన మున్సిపల్ పో లింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే, ఆయా రాజకీయ పార్టీలు ముందస్తుగా అప్రమత్తమయ్యాయి.
ఈ నెల 13న కౌంటింగ్ ప్రక్రి య ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు చెయ్యి జారకుండా ముందస్తుగా వారిని క్యాంపులకు తరలించాయి. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థులను ఎక్కడికి తీసుకెళ్తున్నారో ముందస్తు సమాచారం ఇవ్వకుండా నే క్యాంపులకు తరలించారు. మరోవైపు సమాచారం లీక్ కాకుండా అభ్యర్థుల వద్ద నుంచి సెల్ ఫోన్‌లను తీసుకున్నట్లు సమాచారం.
ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థులతో ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ అధ్యక్షుడు బ్రహ్మానంద్ గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. అభ్యర్థులతో గెలుపోటములపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అభ్యర్థులను ప్రత్యే క బస్సుల్లో మహారాష్ట్ర వైపు క్యాంప్‌నకు తరలించినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సైతం తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించింది. డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో అభ్యర్థులతో సమావేశం అయ్యా రు. గెలుపోవటములపై సుదీర్ఘంగా చర్చించి, ప్రత్యేక బస్సుల్లో క్యాంపులకు తరలించారు.
సూర్యాపేట, యాదాద్రిలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ఆయా పార్టీల నేతలు క్యాంపునకు తరలించినట్లు తెలుస్తున్నది. సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ అభ్యర్తులను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి గురువారం క్యాంపునకు తరలించినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండవచ్చని తెలుస్తుండగా ఎవరు ఊహించని విధంగా బీఆర్‌ఎస్ అభ్యర్థులను క్యాంపునకు తరలించడంలో ఆంతర్యం ఏమిటని స్థానికంగా పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. మునిసిపాలిటీలో 48 వార్డులు ఉండగా అందులో బీఆర్‌ఎస్ 45 స్థానాల్లో పోటీ చేసింది. వీరిలో 43 మందిని క్యాంపునకు తరలించినట్టు వినికిడి.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల కార్పొరేషన్ నుంచి బరిలో ఉన్న 58 మంది బీజేపీ అభ్యర్థులు, లక్షెట్టిపేట మున్సిపాలిటీ నుంచి పోటీలో ఉన్న 14 మంది అభ్యర్థులు క్యాంపునకు తరలివెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 59 మంది, లక్షెట్టిపేట మున్సిపాలిటీ నుంచి 15 మంది అభ్యర్థులు వెళ్లారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి లక్షెట్టిపేట మున్సిపాలిటీలో పోటీలో ఉన్న 14 మంది క్యాంపులో ఉండగా మంచిర్యాల కార్పొరేషన్ నుంచి పోటీలో 58 మంది క్యాంపునకు దూరంగా ఉన్నారు.
వీరందరితో బీఆర్‌ఎస్ నియోజక వర్గ బాస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బాండ్ పేపర్ రాయించుకున్నట్లు సమాచారం. చెన్నూర్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు 18 మంది, కాంగ్రెస్ అభ్యర్థులు 18 మంది క్యాంపునకు తరలించారు. క్యాతనపల్లిలో సైతం బీఆర్‌ఎస్ అభ్యర్థులు 15 మంది, కాంగ్రెస్ అభ్యర్థులు 22 మంది వెళ్లారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 34 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఉదయమే క్యాంపు బాటపట్టారు.
నిజామాబాద్‌లో..
నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, భీమ్‌గల్, బోధన్ మున్సిపాలిటీల్లో పోటీ చేసిన బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను క్యాంపుల కు తరలించారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 60 స్థానాలుండగా కాంగ్రెస్ అభ్యర్థు లు 60 మంది, బీజేపీ అభ్యర్థులు 60 మందిని క్యాంపునకు తరలించారు. కాంగ్రెస్ అభ్యర్థులను హైదరాబాద్ శివారులోని రిసార్టులలలో ఉంచినట్టు తెలుస్తోంది.
జనగామలో
జనగామలో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి క్యాంపునకు తరలించారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను క్యాంపు లకు తరలించిన కొద్దిసేపటికే కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థులను కూడా క్యాంపునలకు తరలించారు.