30 June, 2026 | 3:19 AM

జగదీష్ రెడ్డిపై సీఎం వ్యాఖ్యలు సరికాదు

30-06-2026 02:30 AM

బడుగుల లింగయ్య యాదవ్

సూర్యాపేట, జూన్ 29 (విజయక్రాంతి): నల్లగొండ సభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతుపురాణాలతో సీఎం హోదాను దిగజార్చుకుంటున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఊరుకునేది లేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రూపురేఖలను మార్చిన ఘనత జగదీష్ రెడ్డిదేనని, కేసీఆర్ హయాంలో పదేండ్లు మంత్రిగా ఆయన చేసిన అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేండ్లలో సాధించిందేమిటని నిలదీశారు.

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి జిల్లాకు రెండుసార్లు వచ్చినా ఒక్క పైసా అయినా ఇచ్చిండా అని ప్రశ్నించారు. ’పేమెంట్ ముఖ్యమంత్రి’ మా అభివృద్ధి నాయకుడిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. జగదీష్ రెడ్డి చేసిన అభివృద్ధిపై తాము గంటల తరబడి చెబుతామని, కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఒక్క అభివృద్ధి అయినా చెప్పగలరా అన్నారు. రేవంత్ రెడ్డి బూతు మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇప్పటికైనా మా నాయకులపై ఏడుపు మాని జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు వై. వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.