24 June, 2026 | 1:43 AM

కాబోయే భార్యే హంతకురాలు

24-06-2026 12:38 AM

పుణె లోహగఢ్‌లో వ్యాపారవేత్త హత్య కేసు

పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు

పుణె, జూన్ 23: వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి ఘటన మలుపు తిరిగింది. కాబోయే భార్యను ఫోటో తీస్తూ కేతన్ లోయలో జారిపడి మృతి చెందినట్లు అంతా భావించారు. కానీ పోలీసుల విచారణలో ప్రణాళికా ప్రకారం చేసిన హత్యగా నిర్ధారించారు. కాబోయే భార్య సియా గోయల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 18న విశాల్, సియాలు పుణెలోని లోహగఢ్ కోటకు వెళ్లారు. 400 అడుగుల పై నుంచి లోయలో పడి విశాల్ మృతి చెందాడని సియా పోలీసులకు తెలిపింది.

అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, సియా గోయల్ పొంతనలేని సమాధానాలు చెప్పింది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. సియా మరో వ్యక్తితో సంబంధాలు నెరపుతున్నట్లు గుర్తించారు. విశాల్‌తో పెళ్లి ఇష్టం లేకనే, హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు. లోహగఢ్ కోటపై నుంచి సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి విశాల్‌ను తోసేశారని గుర్తించామన్నారు.  నిందితులను అరెస్టు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

అన్యాయంగా తమ కుమారుడిని పొట్టన బెట్టుకున్న సియా, ఆమె ప్రియుడికి మరణశిక్ష విధించాలని కేతన్ అగర్వాల్ తండ్రి, తల్లి డిమాండ్ చేశారు. కాగా పోలీసులు కేతన్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హత్య, నేరపూరిత కుట్ర కేసు నమోదు చేసినట్లు పూణే రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ తెలిపారు. ఫిబ్రవరిలో విశాల్, సియాకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. 

గతంలో కూడా ఇలాంటి హత్యే జరిగింది. 2025 మే 11న ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌ల వివాహం అయింది. వీరిద్దరూ హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అక్కడ మే 23న రాజా అదృశ్యమయ్యాడు. జూన్ 2న అతని మృతదేహం లోయలో లభించింది. దర్యాప్తు అనంతరం సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా కలిసి రాజాను హత్య చేసినట్లు గుర్తించారు. ఈ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది.