24 June, 2026 | 2:47 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలి

24-06-2026 01:38 AM

ప్రత్యేక అధికారిణి క్రిస్టినా జడ్ చోంగ్తు సమీక్ష

సంగారెడ్డి, జూన్ 23: ప్రజా పాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతులు, సమస్యలను సమగ్రంగా విశ్లేషించి వాటి పరిష్కారానికి జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) రూపొందించాలని జిల్లాకు ప్రత్యేక అధికారిణిగా నియమితులైన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. క్రిస్టినా జడ్ చోంగ్తు అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజా పాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలు, పురోగతిపై ప్రత్యేక అధికారిణి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతో, బాధ్యతాయుతంగా అమలు చేసి విజయవంతం చేసినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.

ప్రగతి ప్రణాళిక సభల సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులు, సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలు, శాఖల వారీగా థీమ్ ఆధారంగా అమలు చేసిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాలు, సాధించిన లక్ష్యాలు, ప్రజల నుంచి వచ్చిన స్పందన తదితర అంశాలపై శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రజా పాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను మూడు విభాగాలుగా వర్గీకరించామని తెలిపారు.

శాఖల అధికారులు గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని పరిష్కరించగల అంశాలపై వెంటనే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, అన్ని శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.