23 April, 2026 | 2:15 PM

Breaking News

జహీరాబాద్ డిపోలో సమ్మెతో ఆగిన బస్సులు

23-04-2026 12:23 AM

జహీరాబాద్, ఏప్రిల్ 22 :ఆర్టీసీ కార్మికుల సమ్మెతో జహీరాబాద్ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికులు బస్టాండ్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇస్తామన్న హామీలను నెరవేర్చకపోవడంతో సమ్మెకు దిగినట్లు కార్మికులు తెలిపారు. జహీరాబాద్ బస్ డిపోలో 360 మంది కార్మికులు పనిచేస్తున్నారు. బస్టాండ్ లోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులు నిరసన తెలుపగా జహీరాబాద్ డీఎస్పి సైదా నాయక్ కార్మికులతో మాట్లాడి బస్టాండ్ లోపల నుండి టెంట్ ను తొలగించాలని, వేరే ప్రాంతంలో టెంట్ వేసి నిరసన తెలిపాలని కోరారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వ కార్మికుల హక్కులను అణచివేసేందకు ప్రయత్నిస్తుందని విమర్శించారు.

బస్సులను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడిపించడం వల్ల టికెట్ కూడా ఇవ్వడం లేదని, పురుషులకు కూడా టికెట్ ఇవ్వకుండా డబ్బులు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి మరింత నష్టం వస్తుందని ఓ కార్మికుడు తెలిపారు. జహీరాబాద్ డిపో నుంచి బస్సులు కదలకపోవడంతో కర్ణాటక నుంచి వచ్చే బస్సుల్లో ప్రయాణికులు తరలివెళ్ళారు. ప్రయాణికులు రోడ్డుపైనే ఎండల్లో నిలబడడంతో ఆటోలు, ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు.