2 July, 2026 | 5:47 PM

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు

02-07-2026 05:07 PM

దమ్మపేట, జూలై 02, (విజయ క్రాంతి): దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రతీ నెల ఆరోగ్యం, పారిశుధ్యం, పోషకాహారం పై అవగాహన మరియు స్థానిక సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంతో నిర్వహించే విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ కమిటీ సమావేశం ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డకు శ్రేయస్సు అని, పుట్టిన ఆరు నెలల వరకు తల్లి పాలు తప్పని సరిగా బిడ్డకు పట్టాలని, ఆరు నెలల తర్వాత పోషక ఆహారంను కొంచెం కొంచెంగా అలవాటు చేస్తూ తినిపించాలన్నారు. బిడ్డకు తల్లి పాల వలన వ్యాధి నిరోధక శక్తితో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు.

బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో తల్లి పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కొని బిడ్డకు పాలు ఇవ్వాలన్నారు. ఉప సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం అన్నారు. నీరు నిల్వ ఉండకుండా, దోమల నివారణ, పరిసరాలను ఎప్పటికప్పుడు క్రిమిసంహారకాలతో శుభ్రపరచడం ద్వారా సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా టైఫాయిడ్ వంటి వాటిని సులభంగా అడ్డుకోవచ్చు అన్నారు. వర్షాకాలంలో బ్యాక్టీరియా మరియు వైరస్‌లు త్వరగా వ్యాపిస్తాయనీ, తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భోజనానికి ముందు, బయటి నుండి రాగానే చేతులు, కాళ్ళను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, ఆహారం, ఎప్పుడూ వేడిగా, తాజాగా వండిన ఆహారాన్ని తినాలన్నారు. నీటి ద్వారా వచ్చే వ్యాధులను నివారించడానికి కాచి, వడపోసిన నీటిని మాత్రమే త్రాగాలన్నారు. ఈ కార్యక్రమంలో పగడాల రాంబాబు, కార్యదర్శి బండి అనంత్ కుమార్, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, రూపా రాంబాబు, పసుమర్తి కుసుమాంబ, ఏ.ఎన్.ఎం లు, అంగన్వాడీలు, బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.