ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా కలెక్టర్ అంకిత్
నాణ్యమైన వైద్య సేవలు అందించాలి..
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు...
కొత్తగూడెం జూలై 2 విజయ క్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో,జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డాక్టర్లు, ఇతర సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి, విధుల నిర్వహణపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బంది ఎన్ని షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించిన కలెక్టర్, ప్రసూతి వార్డులో చికిత్స పొందుతున్న మహిళల సంఖ్య, వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. మూడు షిఫ్టుల్లో రోగులకు సేవలు అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు. జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి,వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యత, వైద్యులు, సిబ్బంది స్పందనపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన, వైద్య సేవలు సకాలంలో అందేలా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట హాస్పటల్ సూపర్డెంట్ ఎం రాధా మోహన్, డివైసిఎస్ఆర్ఎంఓ సీతారాం, ఆర్ ఎం ఓ చైతన్య, కొత్తగూడెం తాసిల్దార్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






