బుల్డోజర్ రాజ్యం
ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..
ఇండ్లను కూలగొట్టడం, భూములను అమ్మడం, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేయడమే రేవంత్ పాలన
మూసీ పేరిట రేవంత్ చేస్తున్న స్కామ్ కోసం వేలాదిమంది ఇళ్ల కూల్చివేత
మూసీ బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండ
బాధిత కుటుంబాలతో మూసీ దండి మార్చ్‌లో కేటీఆర్
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప డ్డారు. హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన కేవ లం ఇండ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం, దానికోసం పేదల జీవితాలను పూర్తిగా నాశనం చేయడమే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టులో భాగంగా ఇళ్లను, భూములను, అపార్ట్‌మెంట్లను కోల్పోతున్న రాజేంద్రనగర్ ప్రాంతంలోని హైదర్ షా కోట్, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. మూసీ బాధితుల కోసం వారు నిర్వహించిన మూసీ దండి మార్చ్ పాదయాత్రలో మూడున్నర కిలో మీటర్ల పాటు అనేకమంది బాధితు లను కలుస్తూ కేటీఆర్ ముందుకు సాగారు. ఆ తర్వాత మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వద్ద జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
మీ ఇళ్లను రెండేళ్లు కాపాడుకోండి.. తర్వాత మేం చూసుకుంటాం
ఒక్క రెండేళ్ల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్‌మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి అన్ని విధాల అండగా ఉంటుందని, తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత మూసీ కోసం ఎవరి భూములు, ఇళ్లు పోకుండా చూస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అపార్ట్‌మెంట్ వాసులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఎన్ని రకాలుగా విజ్ఞప్తులు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వం సానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇప్పటికే అద్భుతమైన ప్రగతి భవన్ సిద్ధంగా ఉన్నా దాన్ని కాదని చెప్పి 200 కోట్ల రూపాయలతో తనకంటూ ఒక నివాసం నిర్మించుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి, ఆయన అన్నదమ్ము లకు మాత్రం వందల కోట్ల ఇళ్లు కావాలి కానీ..
పేదలు, మధ్యతరగతి వారికి ఒక అపార్ట్‌మెంట్ ఉండకుండా ఎందుకు ఈ విధ్వంసం అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే హైడ్రా పేరుతో వందల మంది ఇళ్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి, అటు రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఇబ్బంది కలిగేలా, వారి జీవితాలను చిన్నాభిన్నం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రియల్ ఎస్టేట్ కోసమే మూసీ పేరుతో స్కాం
కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం తన అనుచరులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం మూసీ పేరుతో భారీ స్కామ్‌కు తెరలేపారని, ఇందుకోసం పేదల ఇళ్లను ఫణంగా పెడుతున్నారని ఆరోపించారు. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం 16 వేల కోట్ల రూపాయల తోనే మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని ఒక్క ఇల్లు పోకుండా డీపీఆర్‌ని కూడా సిద్ధం చేశామని కేటీఆర్ తెలిపారు.
అలాంటి అంశాన్ని పక్కన పెట్టి లక్షన్నర కోట్ల రూపాయల దోపిడీ కోసం వేల మంది ఇళ్లను ధ్వంసం చేస్తూ రేవంత్ రెడ్డి కొత్త స్కామ్‌కు తెరలేపారని ఆరోపించారు. ప్రస్తుతం మూసీ బఫర్ జోన్‌కి సంబంధించి రకరకాల మాట లు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఇదే అపార్ట్‌మెంట్లకు పర్మిషన్ ఇచ్చిందని, మరి అలాంటి అధికారులపైన,
అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఏమో జాతీయ స్థాయిలో బీజేపీ బుల్డోజర్ రాజ్యం నడిపిస్తుందని విమర్శలు చేస్తారని, స్వయం గా తన సొంత ముఖ్యమంత్రి, తమ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్న బుల్డోజర్ రాజ్యం గురించి మాత్రం మాట్లాడటం లేదన్నారు.
మరోవైపు మూసీలో ఇళ్లు ఉన్నాయ ని అబద్ధాలు చెప్తూ ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తన సొంత మంత్రులు, తమ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఉన్న ఫాం హౌస్‌లు, విల్లాలు, ఇళ్లను ఎందుకు ముట్టుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ నడుపుతున్నాడని, అందుకే ఇన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి లాంటి భూ బకాసురుడి నుంచి, ఈ బ్రోకర్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని పిలుపునిచ్చారు.




