నేడు బీఆర్‌ఎస్‌వీ, యూత్ వింగ్ రక్తదానం
- తెలంగాణ భవన్‌లో నిర్వహణ
- సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా శిబిరం
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): తెలంగాణలో పంటలు పండించాలంటే బీఆర్‌ఎస్ నాయకులు రక్తం చిందించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్‌వీ), యువజన విభాగం (బీఆర్‌ఎస్‌వై) ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.
‘రేవంత్‌రెడ్డి రక్త దాహానికి రక్తదానం’ పేరిట ఉదయం 11 గంటల నుంచి రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రైతుల కోసం, వారికి సాగునీరు అందించడం కోసం మా రక్తాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. రక్తదాన శిబిరంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.






