1 August, 2026 | 3:59 AM

నిందితులను అరెస్టు చేసేంతవరకు బీఆర్‌ఎస్ నిరంతర పోరాటం

01-08-2026 12:00 AM

బేతెల్లి రాజేందర్ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది

బీఆర్‌ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు

మానకొండూరు, జూలై 31 (విజయక్రాంతి): నిందితులను అరెస్టు చేసేంతవరకు బీఆర్‌ఎస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందని కరీంనగర్ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ రాజేందర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం, మండల కేంద్రమైన తిమ్మాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదురుగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గుండ్లపల్లి మాజీ సర్పంచ్ సమత భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి కుటుంబాన్ని శుక్రవారం బీఆర్‌ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ సుడా చైర్మన్ జీవీ.రామకృష్ణారావు పరామర్శించారు.

ఈ విషాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులైన ఉన్నతాధికారులను సైతం వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, మైపాల్ రెడ్డి, లక్ష్మణ్, తిరుపతి, సురేష్, సుధాకర్, మాజీ ఎంపీటీసీ అంజి తదితరులు పరామర్శ కార్యక్రమానికి హాజరయ్యారు.