26 August, 2026 | 3:44 AM

గిరవెల్లిగెర్రె రహదారిపై నాట్లు వేసి ‘బీఆర్‌ఎస్’ నిరసన

26-08-2026 12:00 AM

ఆసిఫాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): దహేగం మండలం గిరవెల్లిగెర్రె గ్రామాల మధ్య అధ్వానంగా మారిన రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్డుపై భారీగా బురద పేరుకుపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రహదారి నిర్మాణానికి రూ.18 కోట్లు మంజూరు చేయించడంతో పాటు టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేయించారు.

అటవీ శాఖ అనుమతుల కారణంగా నిర్మాణ పనులు ముందుకు సాగలేదని, అనుమతుల కోసం కోనప్ప సుమారు రెండేళ్ల పాటు ప్రయత్నించారని తెలిపారు.ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల్లోనే రహదారిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్లు గడుస్తున్నా రహదారి నిర్మాణం ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు.

అటవీ శాఖ అనుమతులు తీసుకురావడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందని నిలదీశారు.గతంలో ఎక్కడ బురద కనిపించినా వరి నాట్లు వేసి నిరసన తెలిపిన హరీష్ బాబు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండి రహదారి సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు.