18 July, 2026 | 12:14 AM

మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వెంటనే నింపి రైతులను కాపాడాలి

18-07-2026 12:13 AM

కొండపోచమ్మసాగర్ వద్ద వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నిరసన 

గజ్వేల్, జులై 17: కాలేశ్వరం ప్రాజెక్టులోని కన్నేపల్లి పంపులను వెంటనే ప్రారంభించి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లను గోదావరి జలాలతో నింపాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కొండ పోచమ్మసాగర్ వద్ద రైతులతో కలిసి మహాధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతా ప్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

ప్రతిరోజూ లక్షల క్యూసె క్కుల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నప్పటికీ, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి ని మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లకు తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో జలకళతో కళకళలాడిన రిజర్వాయర్లు ప్రస్తుతం ఎండిపోతుండటంతో రైతులు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటి సమస్యలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు.

రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నారు. కన్నేపల్లి పంపులను ప్రారంభించి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లతో పాటు హల్దీవాగు, కుడవెల్లివాగు, సంగారెడ్డి, రామారెడ్డి, కామారెడ్డి, బస్వాపూర్ కెనాళ్లలో వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించిన ఆయన, దెబ్బతిన్న పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని, కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, వైస్ చైర్పర్సన్ పద్మాబాయి నర్సింగరావు, రైతుబంధు రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు దేవి రవీందర్, గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఆయా మండలాల మాజీ ఎంపీపీలు పాండు గౌడ్ అమరావతి శ్యామ్ మనోహర్, దాసరి అమరావతి, జడ్పిటిసిలు మల్లేశం, మంగమ్మ రామచంద్రం, నాయకులు కరుణాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, రైతులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.