స్వయం ఉపాధి.. మహిళా సంఘాలకు పునాది
పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు
15 గ్రామాల్లో మహిళా సమైక్య భవనాల నిర్మాణాలు
250 మంది లబ్దిదారులకు యూనిట్లు మంజూరు
నాగల్గిద్ద, జూలై 17: నాగల్గిద్ద మండలంలో మహిళా సంఘాల ఆర్థిక సాధికా రతకు ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలు ఫలితాలిస్తున్నాయి. మహిళలను ఉపాధి, ఆదాయ మార్గాల వైపు ప్రోత్సహించే లక్ష్యంతో మండల కేంద్రంలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థల అధికారికీకరణ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకంపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
మండలంలో ప్రస్తుతం 423 మహిళా సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వాటిలో 4,285 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా 17 వయోవృద్ధుల సంఘాలు, 17 కిశోర బాలికల సంఘాలు కూడా వివిధ సామాజిక, ఆర్థిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాయి. జీవనోపాధి కార్యక్రమంలో భాగంగా 276 యూనిట్లకు రూ.2.80 కోట్ల ఆర్థిక సహాయం అందించగా, మేకల పెంపకం, బ్రాయిలర్ కోళ్ల పెంపకం వంటి యూనిట్ల ఏర్పాటుకు లబ్ధిదారులను ప్రోత్సహించారు.
మేకల పెంపకం యూనిట్లకు రూ.6 లక్షలు, బ్రాయిలర్ కోళ్ల పెంపకం యూనిట్లకు రూ.5 లక్షల వ్యయంతో మొత్తం 250 మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా మేకల పెంపకం, బ్రాయిలర్ కోళ్ల పెంపకం, ఫీడ్ తయారీ, పశుకోళ్లకు సంబంధించిన సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు అవసరమైన రుణాలు, సబ్సిడీలు, బ్యాంకు లింకేజీలు, సీబీఓల ద్వారా సహాయం లభిస్తుంది.
అలాగే పథకానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, బ్యాంకు రుణ సౌకర్యాలు, సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను మహి ళా సంఘాల సభ్యులు, రైతులు, యువతకు చెబుతున్నారు. మహిళా సంఘాల ఆదాయ వనరులను పెంచే దిశగా చేపట్టిన కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండలానికి చెందిన ఒక బస్సును ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వడంతో ప్రతి నెల రూ.64 వేల ఆదాయం సమకూరుతోంది.
అదేవిధంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల్లో రూ.4 కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి. మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు మండలంలోని 15 గ్రామాల్లో మహిళా సమైక్య భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ భవనాలు పూర్తయిన అనంతరం మహిళా సంఘాల సమా వేశాలు, శిక్షణా కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు శాశ్వత వేదికగా ఉపయోగపడనున్నాయి. ప్రభుత్వ సంక్షేమ, స్వయం ఉపాధి పథకాలను అర్హులైన ప్రతి మహిళకు చేరవేయడంతో పాటు గ్రామీణ మహిళలను ఆర్థికంగా స్వావలంబనగా తీర్చిదిద్దే దిశగా మండలంలో విస్తృత స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి.
ఆర్థికంగా ఎదిగేలా చేయడమే లక్ష్యం
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడమే మా ప్రధాన లక్ష్యం. ప్రభు త్వం అమలు చేస్తున్న పీఎంఎఫ్‌ఎంఈ వంటి స్వయం ఉపాధి పథకాలను మ హిళలు సద్వినియోగం చేసుకొని తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలి. మండలంలోని ప్రతి మహి ళా సంఘాన్ని బలోపేతం చేస్తూ, మేకల పెంపకం, కోళ్ల పెంపకం, ఆహార ప్రాసెసింగ్ వంటి ఉపాధి అవకాశాలను మ రింత విస్తరిస్తాం. మహిళలు స్వయం ఉ పాధి రంగంలో ముందుకు వచ్చి ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాం. మహి ళా సంఘాలకు అవసరమైన శిక్షణ, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు అందేలా నిరంతరం కృషి చేస్తాం.
మండల సమైక్య మహిళా అధ్యక్షురాలు హీనా బేగం
సంఘాలు ఆదాయం పెంచుకునేలా శిక్షణలు..
మహిళల ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. వివిధ రంగాల్లో మహిళలు ముందుకు రావడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం, బ్యాంకు రుణాలు, సబ్సిడీలు, శిక్షణ అందిస్తోంది. ప్రతి మహిళా సంఘం ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలపై దృష్టి సారించి, మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించడం జరుగుతోంది.
మండల మహిళా సమైక్య ఏపీఎం నర్సింలు






