ప్రోటోకాల్ ఉల్లంఘనపై బీఆర్ఎస్ ఆగ్రహం
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన సందర్భంగా నిర్వహించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల స్థానంలో పార్టీ నాయకులను వేదికపైకి ఆహ్వానించడం విచారకరమని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ అన్నారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి ఘటనలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, అయినప్పటికీ అదే విధానాన్ని కొనసాగించడం అధికారుల తీరుపై అనుమానాలు కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా నిర్వహించేలా వ్యవహరిస్తున్న అధికారుల అతిఉత్సాహాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ అంశంపై పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ ప్రోటోకాల్‌ను పాటించాలని డిమాండ్ చేశారు.






