calender_icon.png 6 February, 2026 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు!

06-02-2026 01:30:17 AM

  1. ఆరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, ప్రకాశ్‌గౌడ్‌కు బాధ్యతలు
  2. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల.. కో ఆర్డినేటర్లను నియమించిన కాంగ్రెస్
  3. ఇటీవల అనర్హతవేటు పిటిషన్ నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యేలు

హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచార హడావిడితో రాజకీయం వేడెక్కింది. అందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌తో పాటు మిగతా పార్టీలన్నీ మున్సిపాలిటీల్లో విజయం కోసం తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. అందుకు అధికార కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించిన విషయం తెలిసిందే.

తాజాగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు అధికార కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ల జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలనే 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ డిస్మిస్ చేశారు. పార్టీ మారినట్లుగా ఎలాంటి ఆధారాలూ లేనందున అనర్హత పిటిషన్లు కొట్టేసినట్లుగా స్పీకర్ కార్యాలయం పేర్కొన్న విషయం తెలిసిందే.

వీరిలో ఇప్పుడు ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల బాధ్యతను అప్పగించింది. నిజామాబాద్ కార్పొరేషన్ కో ఆర్డినేటర్‌గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికటపూడి గాంధీ, ఇల్లందు మున్సిపాలిటీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, షాద్‌నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పేర్లు టీపీసీసీ జారీచేసిన జాబితాలో దర్శనమిచ్చాయి.

వివిధ కార్పొరేషన్లకు కో ఆర్డినేటర్లు.. 

* నిజామాబాద్ - మాజీమంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఈరావత్రి అనిల్ 

* రామగుండం - పురానం సతీష్‌కుమార్ 

* మంచిర్యాల- ఎమ్మెల్యే శ్రీగణేష్ 

* కరీంనగర్ - ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, దొమ్మాటి సాంబయ్య 

* నల్లగొండ - ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి 

* మహబూబ్‌నగర్ - ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

* కొత్తగూడెం - తల్లూరి బ్రహ్మయ్య, బాలసాని లక్ష్మీనారాయణ, ఎస్ జగదీశ్వర్‌రావు