28 February, 2026 | 6:02 PM

దేవుడి మాన్యాలపై 'రేవంత్' కన్ను!

28-02-2026 01:37 PM

​రాజశ్యామల ఆలయం కూల్చివేతకు సర్కారు కుట్ర

​అల్లుడి క్రషర్ దందా కోసమేనా?: మాజీ మంత్రి హరీష్ రావు

​కేసీఆర్ ఆనవాళ్లు చెరపడమంటే.. గుళ్లు కూల్చడమేనా అని నిలదీత

​మణికొండ,(విజయక్రాంతి): రాష్ట్రంలో పేదల ఇళ్లను కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), ఇప్పుడు ఏకంగా దేవాలయాలు, మఠాలపై కన్నేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(BRS MLA Harish Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోకాపేట నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయాలంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు ఆకస్మాత్తుగా నోటీసులు లేకుండా రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న హరీష్ రావు హుటాహుటిన పీఠం వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

​అల్లుడి దందా కోసమేనా?

వాటర్ వర్క్స్  అవసరాల కోసమంటూ పీఠం స్థలాన్ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని, మరి పక్కనే ఉన్న 17 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వాటర్ వర్క్స్ ఎందుకు కట్టుకోకూడదని హరీష్ రావు ప్రశ్నించారు. ఆ 17 ఎకరాల (సర్వే నెంబర్ 239, 240) భూమిని సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడికి, మేనల్లుళ్లకు చెందిన 'భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్'కు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఓఆర్ఆర్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ 5 రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు పెట్టించారని, పక్కన ఉన్న బిల్డర్లంతా వారి వద్దే కంకర కొనాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అల్లుడి వ్యాపారానికి ఎకరాలకు ఎకరాలు ధారాదత్తం చేస్తూ, హిందూ ధర్మ ప్రచారానికి కేటాయించిన రెండు ఎకరాలను లాక్కోవడం దారుణమన్నారు.

​చట్టబద్ధంగానే పీఠానికి భూమి

2019లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో క్యాబినెట్ ఆమోదంతోనే కోకాపేట సర్వే నెంబర్ 240లో శారద పీఠానికి రెండు ఎకరాలు కేటాయించామని హరీష్ రావు గుర్తుచేశారు. నిర్వాహకులు ప్రభుత్వానికి రూ.1.05 కోట్లు, హెచ్ఎండీఏకు రూ.23 లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్, ఇతర అనుమతులు తీసుకున్నారని స్పష్టం చేశారు. ఇక్కడ అమ్మవారి దేవాలయంతో పాటు గోశాల, నిత్య అన్నదాన సత్రం, వేద పాఠశాలలు ఏర్పాటు చేసి ఏళ్ల తరబడి పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

​కేసీఆర్ ఆనవాళ్లు చెరపడమంటే ఇదేనా?

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటూ.. ఆయన కట్టిన గుళ్లు, గోపురాలు, మఠాలను కూల్చే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారారని హరీష్ రావు విమర్శించారు. కనీస నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే వందలాది మంది పోలీసులతో వచ్చి పీఠాధిపతిని, నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. దేవుని మాన్యాలపై పడ్డవాళ్లు ఎవరూ బాగుపడలేదని, ఈ పాపం రేవంత్‌కు ఊరికే పోదని హెచ్చరించారు. ​క్యాబినెట్ మంత్రి శ్రీధర్ బాబు చొరవ తీసుకుని సీఎంపై ఒత్తిడి తెచ్చి ఆలయాన్ని కాపాడాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో దేవాలయ పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ భక్తులతో కలిసి భారీ ఎత్తున ఉద్యమిస్తుందని, ఎంతవరకైనా పోరాడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.