1 August, 2026 | 7:57 PM

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

01-08-2026 06:52 PM

రుద్రంగి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా బోనాలు వండి ముత్యాల పోచమ్మకు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల చైర్మన్ బాబు నంబియార్ మాట్లాడుతూ... గ్రామ దేవతలకు ఆషాడ మాసంలో బోనాలు సమర్పించడం మన సంప్రదాయమని అమ్మవారిని వేడుకొని బోనాలు సమర్పించిన తర్వాత విద్యార్థులకు మంచి విద్యబుద్ధులు రావాలని అలాగే గ్రామంలోని అందరిపై ఆ తల్లి దీవెనలు ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు.ప్రిన్సిపాల్ లతిక మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి,

సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడుతాయని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. పోచమ్మ బోనల సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు వేషధారణలు చూపరులను ఆకర్షించాయని అన్నారు. ఆ అమ్మవారి దీవెనలు గ్రామ ప్రజలపై ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సంతోషంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు.