పాదాచారులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణపై సూచనలు
ఉప్పల్,(విజయక్రాంతి): ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉప్పల్ పోలీసులు నిర్వహిస్తున్న “మీ సురక్ష” కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ స్కైవాక్‌పై పాదాచారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ రామలింగారెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్లు దాటే సమయంలో సెల్‌ఫోన్ వినియోగం, నిర్లక్ష్యంగా నడవడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు.
జీబ్రా క్రాసింగ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లను వినియోగించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.అదే విధంగా సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు ఓపెన్ చేయకూడదని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఇతరులతో పంచుకోరాదని సూచించారు. సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించిన ఇన్‌స్పెక్టర్ రామలింగారెడ్డి, ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.






