బచ్పన్ ఏహెచ్పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో బోనాల సంబరాలు
అమీన్ పూర్: బచ్పన్ ప్రైమరీ, బీరంగూడలో తెలంగాణ సాంప్రదాయ పండుగ బోనాలును శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ డైరెక్టర్లు సి.హెచ్. శ్రీనివాస్ రావు, ఆర్.శిరిషారెడ్డి, అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ రాఘవేంద్ర హాజరై విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ శోభను మరింత పెంచారు. బోనాల పండుగ విశిష్టత, చారిత్రక ప్రాముఖ్యత, తెలంగాణ సంస్కృతిలో దాని స్థానాన్ని వివరిస్తూ ప్రత్యేక సభను నిర్వహించారు.
యూకేజీ మరియు 4వ తరగతి విద్యార్థులు ప్రదర్శించిన బోనాల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, సంప్రదాయ కార్యకలాపాలతో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బోనాల పండుగను ఆనందంగా జరుపుకున్నారు.
ఈ వేడుక ద్వారా విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహనతో పాటు వాటిని పరిరక్షించాలనే భావనను పెంపొందించే ప్రయత్నం జరిగింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించి చిరస్మరణీయంగా నిలిపారు.






